గవర్నర్లుగా సుష్మా స్వరాజ్, సుమిత్ర మహాజన్... ఏ రాష్ట్రాలకు తెలుసా ?

కొత్త గవర్నర్ల పేర్లపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌ షా కసరత్తు చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

news18-telugu
Updated: July 8, 2019, 8:24 AM IST
గవర్నర్లుగా సుష్మా స్వరాజ్, సుమిత్ర మహాజన్... ఏ రాష్ట్రాలకు తెలుసా ?
సుమిత్ర మహాజన్, సుష్మాస్వరాజ్
  • Share this:
కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈ సారి గవర్నర్ బాధ్యతలు నిర్వహించనున్నట్లు సమాచారం. వీరితో పాటు... , బీజేపీ సీనియర్‌ నేతలు కల్‌రాజ్‌ మిశ్రా, శాంతాకుమార్‌, ఉమాభారతి, ప్రేంకుమార్‌ ధూమల్‌, మరికొందరు పదవీవిరమణ చేసిన అధికారులను కేంద్రం గవర్నర్లుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిసెర్చ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) మాజీ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ ధస్మానా, ఐబీ మాజీ అధిపతులు రాజీవ్‌ జైన్‌, దినేశ్వర్‌ శర్మ, మాజీ సీఈసీ ఏకే జ్యోతి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. తమకు పెద్ద రాష్ట్రాలను కేటాయించాలని పాండిచ్చేరి గవర్నర్‌ కిరణ్‌ బేడీతో పాటు ఒకరిద్దరు అభ్యర్థిస్తున్నారు. పలువురు గవర్నర్ల పదవీకాలం త్వరలో ముగుస్తున్నందు వల్ల వారి స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశాలు కనపడుతున్నాయి.

అలాగే పలువురు గవర్నర్లకు స్థానచలనం తప్పదని భావిస్తున్నారు. కొత్త గవర్నర్ల పేర్లపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌ షా కసరత్తు చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త గవర్నర్ల పేర్లను మోదీ, షాలే ఖరారు చేస్తారని హోం శాఖ వర్గాలు తెలిపాయి. సుష్మాను పంజాబ్‌కు, సుమిత్రను మహారాష్ట్రకు గవర్నర్లుగా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు ఈ సారి వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశాలున్నాయని హోం శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. విభజన చట్టం ప్రకారం పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఇన్నాళ్లు ఒకే గవర్నర్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుత గవర్నర్‌ నరసింహన్‌ 2009 నుంచి కొనసాగుతూ వస్తున్నారు. రెండు రాష్ట్రాలు పూర్తిగా వాటి భూభాగాల నుంచి పరిపాలన సాగిస్తుండటం, హైకోర్టు కూడా వేరుపడిన నేపథ్యంలో గవర్నర్లను వేరుగా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత గవర్నర్‌ పదేళ్లకు పైగా కొనసాగుతున్నారని, ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ పదవీ కాలం ఎప్పుడో ముగిసినా తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు కొనసాగవలసిందిగా ఆయనకు చెప్పామని హోం శాఖ వర్గాలు తెలిపాయి.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...