ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక విధంగా ఇబ్బంది కలిగించే అంశమే. ఇప్పటికే సీఎం సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా జగన్ కేబినెట్ లో మరో మంత్రి ఇదే తరహాలో సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనే ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఆదిమూలపు సురేష్. మంత్రి సురేష్ తో పాటు ఆయన సతీమణి, ఐఆర్ఎస్ అధికారి టీఎన్ విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పుబట్టిన సుప్రీం.. సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సీబీఐ లాంటి సంస్థలు... అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమయంలో జాగ్రత్త వహించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేరకు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేసింది.
ప్రస్తుత ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సతీమణి విజయ లక్ష్మి ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులు. ఉద్యోగాన్ని వదిలిపెట్టిన సురేష్.. రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. 2016లో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారనే ఆరోపణలపై సీబీఐ 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ఎస్ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో విజయలక్ష్మిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇందులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా ఆదిమూలపు సురేష్ ను పేర్కొన్నారు.
అయితే ఈ ఎఫ్ఐఆర్ ను సురేష్ దంపతులు తప్పుబట్టారు. సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిల్ లలిత కుమారి నేతృత్వంలోని ధర్మాసనం.. మంత్రి దంపతులకు అనుకూలంగా ఆదేశిలిచ్చింది. ప్రాథమిక విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ ను తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆ విషయాన్ని అఫిడవిట్ లో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలంది. మరోసారి ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రిపై సీబీఐ కేసు నమోదయ్యే అవకాశముండటం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారనుంది.
సుప్రీం తీర్పునేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ తక్షణమే తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి. భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యాశాఖలో ఆయన కొనసాగడానికి వీల్లేదని టీడీపీ ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి మొదలు కేబినెట్ లోని సగంమందిపై అవినీతి ఆరోపణలున్నాయని, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వాన్ని రద్దుచేసి తక్షణమే ఎన్నికలకు వెళ్లాలన్నారు. అవినీతి, అక్రమార్జనపై దృష్టిపెట్టిన ఆదిమూలపు సురేశ్ తన సొంతజిల్లా అభివృద్ధి కోసం ఒక్కపని కూడా చేయలేదని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister suresh, AP Politics, CBI