కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాపై వారం రోజుల పాటు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి రాజీనామాలు ఆమోదించడం కానీ, వారిపై అనర్హత వేటు వేయడం కానీ చేయకూడదని తెలిపింది. కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. విస్తృత రాజ్యాంగ అంశాలపై స్పష్టత వచ్చేవరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేసింది.
అంతకుముందు రాజీనామా చేసిన వారిలో 11 మంది సభ్యులు స్పీకర్ను కలిశారు. ఆ తర్వాత ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. 11 మంది రాజీనామాల్లో ఎనిమిది లేఖలు నిర్దేశిత ఫార్మాట్లో లేవని స్పష్టం చేశారు. ఆ మిగిలిన లేఖలకు సంబంధించి తాను పూర్తిగా అధ్యయనం చేయాలని, ఎమ్మెల్యేలను కలిసి.. వారు మనస్ఫూర్తిగా రాజీనామా చేశారా? లేదా తెలుసుకోవాల్సి ఉందన్నారు. వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా, మనస్ఫూర్తిగా రాజీనామా చేసినట్టు తాను కన్విన్స్ అయితే, అప్పుడు వారి రాజీనామాలను ఆమోదిస్తానని చెప్పారు. తాను రాజ్యాంగం ప్రకారం, ప్రజల అభీష్టం ప్రకారం నడుచుకుంటానని స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ తాత్సారం చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు తనను చాలా బాధించాయని స్పీకర్ రమేష్ కుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.