ప్రముఖ నటి, మండ్య ఎంపీ సుమలతపై కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయని సుమలత ఫైర్ అయ్యారు.
ప్రముఖ నటి, మండ్య ఎంపీ సుమలతపై కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయని సుమలత ఫైర్ అయ్యారు. ఆ వ్యాఖ్యలు కుమారస్వామి ఆలోచన ధోరణికి అద్దం పడుతున్నాయని అన్నారు. కృష్ణ రాజ సాగర్(కేఆర్ఎస్) డ్యామ్ బీటలు వారి లీకేజీ జరుగుతోందిని, అక్రమ మైనింగ్ ఇందుకు కారణమని సుమలత వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ప్రతి విమర్శ చేసిన కుమారస్వామి.. సుమలతపై మండిపడ్డారు. కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘కేఆర్ఎస్ డ్యామ్‌ను ఆమె ఒక్కరే రక్షించే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ లీకేజ్ ఉంటే.. లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెట్టాలి. మండ్యకు ఇలాంటి ఎంపీ గతంలో ఎన్నిక కాలేదు, భవిష్యత్తులో కూడా ఉండబోరు. ఆమె సానుభూతితో ఎన్నికల్లో గెలిచారు. ఆమె సరిగా పనిచేయనివ్వండి. ఆమెకు మరోసారి ఇలాంటి అవకాశం రాదు. ఆమె వ్యక్తిగత ద్వేషంతో కూడిన ప్రకటనలు చేస్తోంది. ప్రజలు ఆమెను క్షమించరు’అని కుమారస్వామి అన్నారు.
కుమారస్వామి తనపై విమర్శలు చేసిన తర్వాత ఆమె ముఖ్యమంత్రి యడియూరప్పని కలిశారు. ఇక, కుమాస్వామి వ్యాఖ్యలపై స్పందించిన సుమలత.. మాజీ ముఖ్యమంత్రికి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని అన్నారు. ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని వ్యాఖ్యానించారు. ఇక, కేఆర్ఎస్పై తాను చేసిన వ్యాఖ్యలను సుమలత సమర్ధించుకున్నారు. విపత్తు నిర్వహణ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఇదే రకమైన ఆందోళనలను వ్యక్తం చేసిందని చెప్పారు. కేంద్ర జల శక్తి మంత్రితో, పార్లమెంట్లో తాను ఈ విషయాన్ని లేవనెత్తానని చెప్పారు.
‘నేను ఎవరి పేరు ప్రస్తావించలేదు. కానీ అతను ఎందుకు స్పందిస్తున్నాడు.అతను దీన్ని వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నాడు?. ఒక మహిళపై వ్యక్తిగత దాడికి దిగుతున్నాడు. మండ్యలో అక్రమ మైనింగ్‌లో పాల్పడిన వారిలో ఎవరున్నారనేది బహిరంగ రహస్యం. నేను మైనింగ్‌కు వ్యతిరేకం కాదు. అక్రమ మైనింగ్‌కు మాత్రమే వ్యతిరేకం. రిజర్వాయర్‌పై సమగ్ర దర్యాప్తు జరగనివ్వండి’అని సుమలత అన్నారు. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సుమలత.. జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించిన సంగతి తెలిసిందే.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.