ఏపీకి కేంద్రమంత్రి పదవి... ఆ ఇద్దరిలో ఎవరికి ?

ఏపీకి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు కేంద్ర కేబినెట్‌లో చోటు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

news18-telugu
Updated: July 27, 2019, 4:43 PM IST
ఏపీకి కేంద్రమంత్రి పదవి... ఆ ఇద్దరిలో ఎవరికి ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ నుంచి ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేకపోవడం... ఏపీలో ఏ పార్టీతోనూ బీజేపీతోకి పొత్తు లేకపోవడంతో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం దక్కలేదు. అయితే ఏపీలో రాజకీయంగా బలపడాలనే ఉద్దేశ్యంతో ఉన్న బీజేపీ... కేంద్ర కేబినెట్‌లో ఏపీకి ప్రాతినిథ్యం కల్పించాలనే భావనలో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోంది. ఏపీకి త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో బెర్త్ దక్కుతుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాధవ్ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీంతో అప్పటి నుంచి కేంద్రమంత్రి కాబోయే ఆ వ్యక్తి ఎవరనే అంశం బీజేపీతో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

అయితే ఓ ఇద్దరు నేతలు కేంద్ర కేబినెట్‌లో చోటు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి మరోసారి కేబినెట్ బెర్త్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరికి ఏపీ కోటాలో మరోసారి కేంద్రమంత్రి అయ్యేందుకు బాగానే లాబీయింగ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు కేంద్రమంత్రి పదవి ఇస్తే... టీడీపీ నుంచి బీజేపీలోకి మరింత మంది నేతలను తీసుకొస్తానని ఆయన పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం. ఇక కేంద్రమంత్రి పదవి కోసం పురంధేశ్వరి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఐదేళ్ల పాటు ఎలాంటి పదవి లేకుండా బీజేపీలో కొనసాగిన పురంధేశ్వరి... ఈ సారి మాత్రం రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్రమంత్రి పదవి ఆశిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం స్థాయిలో టార్గెట్ చేస్తున్న పురంధేశ్వరి... తనకు కేంద్రమంత్రి పదవి ఇస్తే టీడీపీతో పాటు వైసీపీపై కూడా పోరాటం చేస్తాననే సంకేతాలు పంపిస్తున్నారు. మొత్తానికి ఏపీకి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్న మోదీ షా జోడి... ఆ ఛాన్స్ సుజనా చౌదరి లేక పురంధేశ్వరిలో ఒకరికి ఇస్తారా లేక మరొకరిని తెరపైకి తెస్తారా అన్నది చూడాలి.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు