Home /News /politics /

STALIN TURNS DOWN KCR FEDERAL FRONT TALKS REMAIN INCONCLUSIVE DUE TO DMKS STRONG ALLIANCE WITH CONGRESS MS

ఫెడరల్ ఫ్రంట్ టాక్ : స్టాలిన్-కేసీఆర్ భేటీలో ఏం తేల్చినట్టు..?

కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న స్టాలిన్

కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న స్టాలిన్

    తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకె అధినేత స్టాలిన్ మధ్య జరిగిన భేటీ అసంపూర్తిగానే ముగిసినట్టు సమాచారం. కేసీఆర్ ప్రతిపాదించిన కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్‌కు స్టాలిన్ సుముఖత వ్యక్తం చేయనట్టు తెలుస్తోంది. గతంలో ప్రకటించినట్టుగానే డీఎంకె కాంగ్రెస్ వెంట నడుస్తుందని స్టాలిన్ కేసీఆర్‌తో స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు, బీజేపీ వ్యతిరేక పోరాటంలో మీరు కూడా కాంగ్రెస్‌తో చేతులు కలిపితే బాగుంటుందని స్టాలిన్ కేసీఆర్‌కు సూచించినట్టు డీఎంకె వర్గాలు 'న్యూస్18'తో తెలిపాయి.

    నిజానికి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న స్టాలిన్.. కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశాలు లేవని మొదట ప్రచారం సాగింది. దీంతో స్టాలిన్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను పరోక్షంగా తిప్పికొట్టారన్న చర్చ జరిగింది. ఇంతలోనే ఇద్దరు భేటీ కాబోతున్నారని తెలియడంతో.. స్టాలిన్ ఫెడరల్ ఫ్రంట్‌పై ఎలా స్పందిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. భేటీ తర్వాత ప్రెస్ మీట్ ఉంటుందని భావించినప్పటికీ.. అలాంటిదేమి జరగలేదు. దీంతో స్టాలిన్‌తో భేటీ కేసీఆర్‌కు నిరాశనే మిగిల్చిందన్న వాదన వినిపిస్తోంది.


    గతేడాది ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కేసీఆర్ కలిసిన సమయంలోనూ మీడియాతో ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన సందర్భంలో.. మీడియా ఆయన్ను స్పందించాలని కోరగా.. అంతా 'రావు సాబ్'కే తెలుసంటూ నవీన్ చేతులెత్తేశారు. తాజాగా స్టాలిన్ కూడా కేసీఆర్‌కు హ్యాండ్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

    కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని బలంగా నమ్ముతున్న కేసీఆర్.. తన తదుపరి భేటీల్లో మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్‌లను కలిసే అవకాశాలున్నాయి. స్టాలిన్ లాగే వాళ్లు కూడా కేసీఆర్ ప్రతిపాదనను లైట్ తీసుకుంటారా..? లేక సానుకూలంగా స్పందిస్తారా? అన్నది వేచి చూడాలి.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: CM KCR, Federal Front, Lok Sabha Elections 2019, MK Stalin

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు