SRINIVASA REDDY BLAMES PONGALETI FOR CROSS VOTE IN KHAMMAM LOCAL BODY MLC POLLS IS IT RIGHT KMM VB
Telangana Politics: పొంగులేటికి పొగ.. ఆ మాజీ ఎంపీని పార్టీ నుంచి సాగనంపేందుకునా..?
పొంగులేటి శ్రీనివాస రెడ్డి (ఫైల్)
Telangana Politics: ''ఆడు మగాడ్రా బుజ్జి... లేకపోతే ఆ ఒక్కడు... అదీ ఏ పదవీ లేకుండా ఇన్ని ఓట్లు క్రాస్ చేయడమేంటి? అందుకే ఆడు మగాడ్రా బుజ్జి. ఈనెల 10వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి 480 ఓట్లు సాధించి గెలిచాడు.
''ఆడు మగాడ్రా బుజ్జి... లేకపోతే ఆ ఒక్కడు... అదీ ఏ పదవీ లేకుండా ఇన్ని ఓట్లు క్రాస్ చేయడమేంటి? అందుకే ఆడు మగాడ్రా బుజ్జి. ఈనెల 10వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి 480 ఓట్లు సాధించి గెలిచాడు. వాస్తవానికి ఈ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ బలం 550 ఓట్ల వరకూ ఉంది. కాంగ్రెస్ కు 96 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 242 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఉన్న ఓట్ల కన్నా 146 ఓట్లు అత్యధికంగా వచ్చాయన్న మాట. ఈ ఓట్లలో ఎక్కువగా ఖమ్మం, వైరా, పాలేరు, అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనే ఎక్కువగా క్రాస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికంతటికీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డే కారణమని ఆయా నియోజకవర్గ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు తెగ ఊదరగొడుతున్నారు.
ఒక్కడూ... ఒకే ఒక్కడూ... ఇన్ని ఓట్లను ప్రభావితం చేస్తాడా..? అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజమే ఏ పదవి లేకుండా ఆ ఒక్కడు అన్ని ఓట్లను ప్రభావితం చేస్తే... పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నట్లు అనే సందేహం టీఆర్ఎస్ శ్రేణులను తెగ తొలిచేస్తోంది. ఆ నోట... ఈ నోట ఇది పార్టీ పెద్దల వరకూ వెళ్లింది. ఎమ్మెల్యేలందరూ క్రాస్ ఓటింగ్ నెపాన్ని పొంగులేటిపై నెట్టి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ పెద్దలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోందట. అన్నట్టు అందరూ యాదికి ఉంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు....వీటిలో ఏ ఎన్నికల్లోనూ పొంగులేటికి అభ్యర్థులను గెలిపించే బాధ్యత పార్టీ ఇవ్వలేదు. మరీ ఈ ప్రజాప్రతినిధులు పొంగులేటి చెప్పినట్లు ఓటెలా వేస్తారు? విజ్ఞతతో ఆలోచించే వారెవరికైనా ఈ విషయం బోధపడుతుంది. ఆత్మస్తుతి - పరనింద మన ప్రతిష్టను దిగజారుస్తుందనే విషయం అప్పుడెప్పుడో కేటీఆర్ సారు చెప్పినట్టు గుర్తు. ఇప్పటికైనా తెరాస నేతలు ఈ విషయాన్ని గుర్తెరుగుతే మంచిదనే చర్చ నడుస్తోంది...'' ఇదీ గత రెండు రోజులుగా పొంగులేటి అనుకూల సోషల్‌మీడియా గ్రూపుల్లో హల్చల్ చేస్తున్న టెక్ట్స్.
ఖమ్మంజిల్లా టీఆర్ఎస్లో ఇంకా క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయా? ఈ ఎపిసోడ్ వెనక ఉన్నదెవరు? వారిని పార్టీ గుర్తించిందా? చర్యలు తీసుకుంటుందా?ఇంతలోనే జిల్లా నాయకులు ఒకరిపై ఒకరు ఎందుకు బురద జల్లుకుంటున్నారు? అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించిందెవరు? పోలింగ్ జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా.. చర్చ మాత్రం క్రాస్ ఓటింగ్‌పైనే కొనసాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఈ అంశంపైనే చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఖమ్మం జిల్లా ఫలితాలు అధికారపార్టీలో అలజడి రేపుతున్నాయి.
ఈ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థికి.. ఆ పార్టీకి ఉన్న ఓటర్ల సంఖ్యాబలం కంటే 150కి పైగా ఓట్లు ఎక్కువగా వచ్చాయి. టీఆర్ఎస్కు చెందిని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కాంగ్రెస్‌కు ఓటేసినట్టు తేలిపోయింది. అయితే ఏ నియోజకవర్గానికి చెందిన వాళ్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు? ఎవరి అనుచరులు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు? అనే అంశాలు ఇంకా తేలలేదు. సమస్య తీవ్రతను గుర్తించాలనే డిమాండ్ మాత్రం బలంగా వినిపిస్తోంది. దీంతో సహజంగానేటీఆర్ఎస్ మీటింగ్‌పై ఖమ్మం గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. గత కొన్నేళ్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో ఆధిపత్యపోరు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ తగాదాలు ముదిరినట్టు చెప్పొచ్చు.
జిల్లాలో ముఖ్య నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలోని ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఈ క్రాస్ ఓటింగ్‌పై టీఆర్ఎస్ సమీక్షకు సిద్ధమవుతున్న సమయంలో.. జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగే టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఖమ్మం క్రాస్ ఓటింగ్‌పై గులాబీ బాస్ మాట్లాడతారని అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జిల్లా టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తర్వాత ఉమ్మడి జిల్లాలో అసలు సిసలు రాజకీయం మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని అవకాశంగా తీసుకుని సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయాలనే ఎత్తుగడలు వేస్తున్నారట గులాబీ నేతలు. క్రాస్ ఓటింగ్ గురించి ఎవరు ప్రస్తావించినా.. తమ రాజకీయ ప్రత్యర్ధుల పేర్లు ప్రస్తావిస్తున్నారట. ఎదుటివారు విశ్వేసించేలా మాటలు కలిపేస్తున్నారట.
ఈ విషయంలో ఎవరి విశ్లేషణలు వారివే. సోషల్ మీడియాలోనూ కొందరిని టార్గెట్ చేస్తూ బురద జల్లుడు మొదలైంది. వాటిపై చర్చ నడుస్తుండగానే.. ఇప్పుడు తెలంగాణ భవన్లో నిర్వహించే సమావేశంపై అందరి దృష్టీ పడింది. క్రాస్ ఓటింగ్‌కు కారణమైన వారిని గుర్తించి.. చర్యలు తీసుకుంటారా? పార్టీ సమీక్షలో ఈ రగడను టచ్ చేస్తారా అనే ఆసక్తి గులాబీ వర్గాల్లో ఉంది. మరి. ఖమ్మం క్రాస్ ఓటింగ్ ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. అయితే తాజాగా శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీగా విజయం సాధించిన తాతా మధుసూదన్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన విజయానికి కృషి చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు సహా ఇంకా పలువురు స్థానిక నాయకులను, మండల స్థాయి లీడర్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా వ్యూహాత్మకంగానే అందరూ ఓట్లు క్రాస్ కావడం, కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలానికి కంటే ఒకటిన్నర రెట్లకు పైగా ఓట్లు రావడం వెనుక మాజీ ఎంపీ పొంగులేటి పాత్ర విశేషంగా ఉందని చెప్పినట్టు సమాచారం. దీనిపై సీఎం కేసీఆర్ ఒకింత అసహనం వ్యక్తం చేసి, తాను థర్డ్ పార్టీ ద్వారా నిజాలను రాబడతానని స్పందించినట్టు నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు మాత్రం క్రాస్ ఓటింగ్‌లో పొంగులేటి పాత్ర ఏమీ లేదని తేల్చి ఆమేరకు నివేదిక పంపినట్టు చెబుతున్నారు. ఎలాగోలా పొంగులేటిని పార్టీ నుంచి సాగనంపాలన్న దానిపై కొన్ని గ్రూపులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయని, అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ లకు క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలుసన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా తమ భవిష్యత్ కోసం ఎవరికి వాళ్లే తమ తమ ప్రయత్నాల్లో పడిపోయారు. ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న ప్రశ్న ప్రతి సామాన్య తెరాస కార్యకర్తలోనూ నెలకొని ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.