M. Bala Krishna, Hyderabad, News18
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఇటీవల తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాలు కాస్త వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. చాలా అంశాల్లో కోర్టు అక్షింతలు వేసిన సందర్భాలు లేకపోలేదు. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నేతల మాట తీరు, చేసే విమర్శలపైనా వ్యతిరేకత వస్తోంది. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు పార్టీని మరింత డ్యామేజ్ చేసే విధంగా ఉందని సొంత పార్టీ నేతలే భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ నేతలు కాస్త హద్దుమీరి ప్రతిపక్ష పార్టీకి ఊపిరి పోశారాని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వివాదానికి కారణమైన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాను కాస్త మందలించినట్లు సమాచారం.
ఇద్దరు నేతల పట్ల కాస్త గుర్రుగా ఉన్న సీఎం జగన్.. మాట్లాడేటప్పుడు కాస్త వెనుక ఆలోచించుకోవాలి కదా అని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కుప్పం ఫలితంతో డీలాపడ్డ చంద్రబాబుకు టీడీపీకి ఒక చిన్న మాటతో ఆయుధం ఇచ్చినట్లు అయిందని అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అసలు అసెంబ్లీలో బాబును ఆ స్థాయిలో కార్నర్ చేయాల్సిన అవసరం ఏంటని తమ పార్టీ నేతలు కొందరు పెదవి విరుస్తున్నారట. చంద్రబాబు అలా మీడియా మందు వెక్కివెక్కి ఏడవడంతో ప్రజల్లో కాస్త సానుభూతి రావడానికి కారణమైందని అధికార పార్టీలో చర్చ నడుస్తోందట. గతంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత పట్టాబి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు చేసిన హాడవిడి అప్పుడు కాస్త పార్టీకి ప్లస్ పాయింట్ అయినప్పటికీ మొన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన పార్టీకి పూర్తీ స్థాయిలో మైనస్ అయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదిలా ఉంటే అధికారపార్టీ నేతలు చేసిన తప్పుకు అప్పటికప్పుడు సమయస్పూర్తితో రియాక్ట్ అయి తెలుగు తమ్ముళ్లు కూడా అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వాడుకున్నారు. స్వయంగా పార్టీ అధినేతే మీడియా ముందు చిన్నపిల్లాడిలా ఏడవడం తర్వాతి రోజు నందమూరి కుటుంబం మొత్తం బాబుకు బాసటగా నిలవడం వంటివి ప్రజల్లో చర్చకు కారణమయ్యాయి అని అధికారపార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా కొడాలి నాని, వల్లభనేని వంశీలు చంద్రబాబుపై తమదైన శైలీలో విరుచుకుపడుతున్నారు. నారా లోకేష్ విషయం అసలు చెప్పనవసరం లేదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటునే ఉన్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్ పలుసార్లు కొడాలి నానికి చెప్పారట. విమర్శించేటప్పుడు లైన్ దాటోద్దు అని సీఎం చెప్పినా.. ఆయన వ్యవహార శైలిలో మాత్రం మార్పు రాలేదట.
మంత్రి నాని నోటి దురుసుతో ఈరోజు టీడీపీ ఒక కొత్త అస్త్రాన్ని ఇచ్చారని పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై నేతలు కాస్త అచితూచి స్పందించాలని కూడా అధినేత నుంచి సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తానికి కుప్పంలో ఓటిమి తరువాత టీడీపీ భవిష్యత్తుపై అనుమాలను వ్యక్తమైన వారికి వైసీపీ నేతలు ఇచ్చిన అస్త్రంతో కాస్త ఊపుతెచ్చిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rambabu, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kodali Nani, Ysrcp