ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. వాటిలో కొన్ని కీలకమైన కార్పొరేషన్ల ఛైర్మన్లను తొలగించింది. అందులో ప్రముఖంగా చెప్పాల్సిన పేర్లు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవి నుంచి తప్పించారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణుకి కూడా ప్రభుత్వం ఉద్వాసన పలికింది. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా, ప్రత్యర్థులపై విరుచుకుపడే నేతగా పేరున్న రోజాను పదవి నుంచి తప్పించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. సీఎం జగన్ ఆమెకు ఉద్వాసన పలకంపై రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఐతే కీలక పదవి నుంచి రోజాను తప్పించడం వెనుక వేరే కారణముందన్న ప్రచారం కూడా లేకపోలేదు. కొందరు ముఖ్యనేతలను కార్పొరేషన్ పదవుల నుంచి తొలగించడం వెనుక సీఎం జగన్ వ్యూహం ఉందని తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈలోగా రాజకీయ అసంతృప్తులను చల్లార్చడానికి నామినిటెడ్ పదవులను భర్తీ చేశారు. రోజా తొలగింపుకు మంత్రివర్గంలో మార్పులకు లింక్ ఉన్నట్లు సమాచారం.
ఆర్కే రోజాను మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెకు మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగింది. ఐతే సామాజిక సమీకరణాలు, జిల్లాలో రోజాకంటే సీనియర్ నేతలుండటంతో ఆమెను అదృష్టం వరించలేదు. దీంతో అప్పట్లోనే ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐతే సీఎం జగన్.. రోజాకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చి బుజ్జగించారు. అప్పట్లో భర్తీ చేసిన అతితక్కువ నామినేటెడ్ పోస్టుల్లో ఇది కూడా ఒకటి. కానీ కీలక పదవి అయితే వచ్చిందిగానీ రోజా మాత్రం దీనిపై అసంతృప్తిగానే ఉన్నారు. అప్పుడప్పుడూ సమీక్షా సమావేశాలు నిర్వహించడం తప్ప ఏపీఐఐసీపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న ప్రచారమూ లేకపోలేదు.
మరోవైపు రోజా కూడా గత మూడు నెలల నుంచి నియోజకవర్గంపై, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. కొవిడ్ సమయంలోనూ నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలు. అలాగే అవసరమైనప్పుడల్లా ప్రతిపక్షాలపై మాటల తూటాలు విసిరారు. ఇటీవల జల వివాదం విషయంలో సీఎం జగన్ ను విమర్శిస్తున్న తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ జోలికిగానీ, జగన్ జోలికి గానీ వస్తే అంతు చూస్తామంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, MLA Roja, Ysrcp