ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కొంతకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనే చర్చ జరుగుతోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో సమూలు మార్పులు చేస్తానని సీఎం జగన్ (AP CM YS Jagan) అప్పట్లోనే ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవడంతో ఏ క్షణానైనా మంత్రులను మార్చివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లో మార్పులు చేర్పులపై అటు సీఎంఓ నుంచి గానీ, ఇటు పార్టీ నుంచి గానీ ఎలాంటి సమాచారం లేదు. ఐతే ఎవరికి వారు సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. ఐతే మంత్రిమండలి (AP Cabinet Changes) లో మార్పులు, చేర్పులు ఇప్పట్లో ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఓ నిర్ణయానికి వచ్చినా.. వెంటనే మార్చే ఛాన్స్ లేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ ప్రకటించిన విధంగా డిసెంబర్లో మార్పులు జరగాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం మే, జూన్ నెలల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ముందుగా చెప్పిన విధంగా వందశాతం మంత్రులను మార్చే అవకాశం లేదని తెలుస్తోంది. కరోనా కారణంగా తాము పూర్తిస్థాయిలో శాఖలపై పట్టు సాధించలేకపోయామని, మరికొంతకాలం అవకాశం కల్పించాలని సీఎంను పలువురు మంత్రులు కోరినట్లు తెలుస్తోంది. దీంతో మరో ఆరు నెలలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
కొందరికే అవకాశం..?
ఇదిలా ఉంటే మంత్రివర్గంలో మార్పులు చేసే సమయంలో ఇప్పుడున్న అందర్నీ తొలగించకపోవచ్చన్న చర్చ కూడా సాగుతోంది. ఏడు లేదా ఎనిమిది మందితో రాజీనామా చేయించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడమా... లేక ఎనిమిది మందినే ఉంచి మిగిలిన వారిని తప్పించడమా అనే అంశాలపై సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే ఒక్కసారిగా అందర్నీ మార్చేస్తే ఎన్నికల నాటికి కొత్తమంత్రులు ఆయా శాఖలపై పట్టుసాధించకపోవచ్చని.. అలా జరిగితే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తప్పకుండా పదవులివ్వాల్సిన వారికి అవకాశం కల్పించి.. కీలక నేతలు, కీలక శాఖలకు సంబంధించిన వారిని కొనసాగిస్తారన్న ప్రచారమూ ఉంది.
వారికి పార్టీ పదవులు
2022లో మంత్రివర్గంలో మార్పులు చేస్తే.. 2024 ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉన్నందున.. కేబినెట్ నుంచి తప్పించిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై సీఎం జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారు, అలాగే ప్రతిపక్షాలపై తమ మాటలతో విరుచుకుపడే మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే తమ శాఖలపై పట్టుసాధించనివారు, అరోపణలు ఎదుర్కొంటున్నవారిని పక్కనబెట్టే సూచనలున్నాయి. ఓ మంత్రిని రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం జరుగుతున్నా ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy