రేవంత్ రెడ్డి రివెంజ్...టార్గెట్ ఉత్తమ్...కాంగ్రెస్‌లో సరికొత్త చర్చ

హుజూర్ నగర్‌లో ఎవరికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే అంశంపై ఉత్తమ్ మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే అంశంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. మరి ఇలాంటి విషయంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కుంతియాకు ఫిర్యాదు చేయడం ఏమిటనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: September 18, 2019, 6:10 PM IST
రేవంత్ రెడ్డి రివెంజ్...టార్గెట్ ఉత్తమ్...కాంగ్రెస్‌లో సరికొత్త చర్చ
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఏకంగా టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేయడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ ప్రకటించడాన్ని తప్పుబట్టిన రేవంత్ రెడ్డి... ఈ అంశంపై కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కోరారు. నిజానికి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి ఎంపిక దాదాపు ఖాయమనే చెప్పాలి. ఉత్తమ్ ప్రకటించకపోయినా... కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆమె వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువ.

దీనికి తోడు తన సిట్టింగ్ స్థానమైన హుజూర్ నగర్‌లో ఎవరికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే అంశంపై ఉత్తమ్ మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే అంశంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. మరి ఇలాంటి విషయంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కుంతియాకు ఫిర్యాదు చేయడం ఏమిటనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీ పీసీసీ చీఫ్ బాధ్యతలు దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి... దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కూడా కన్విన్స్ చేశారనే వార్తలు వచ్చాయి.

అయితే చివరి నిమిషంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొందరు సీనియర్ నేతలతో కలిసి రేవంత్‌కు టీ పీసీసీ చీఫ్ పదవి రాకుండా అడ్డుకున్నారని ఊహాగానాలు వినిపించాయి. రేవంత్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని... తనకు టీ పీసీసీ చీఫ్ పదవి రాకుండా అడ్డుకున్న ఉత్తమ్ తీరుపై గుర్రుగా ఉన్నారని కాంగ్రెస్‌లోని ఓ వర్గం భావిస్తోంది. ఈ కారణంగానే ఆయన ఉత్తమ్‌పై ఈ రకంగా రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

ఈ క్రమంలోనే హుజూర్ నగర్‌లో ఉత్తమ్ భార్య పద్మావతికి కాకుండా స్థానికుడైన కిరణ్ రెడ్డి అనే కాంగ్రెస్ నేతకు టికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్‌లో ఇంతకాలం తెరచాటుగా ఉన్న రేవంత్ వర్సెస్ ఉత్తమ్ మధ్య విభేదాలు... తాజా ఎపిసోడ్‌లో బట్టబయలైనట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మరి... ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా డీల్ చేస్తుందో చూడాలి.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>