• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • SPECIAL STORY TDP CHIEF CHANDRABABU NAIDU CELEBRATES HIS 71TH BIRTHDAY BS

Opinion | అలుపెరుగని శ్రామికుడు చంద్రబాబు..

Opinion | అలుపెరుగని శ్రామికుడు చంద్రబాబు..

చంద్రబాబు నాయుడు

Chandrababu Birthday : పట్టుదల, అంకితభావం, సమర్థత, దురదృష్టి ఈ లక్షణాలు వున్న నాయకుడు వాటిని సానుకూలశక్తిగా ఉపయోగించుకొన్నప్పుడు ఎదురైన ప్రతిఓటమి, ప్రతి అవమానం విజయపథంలో నడిపించే ఇందనాలు అవుతాయి.. అంతటి ఘనుడు చంద్రబాబు.

 • Share this:
  నీరుకొండ ప్రసాద్
  (మాజీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ప్రత్యేక వ్యాసం..)
  ఆయన అనేక యుద్ధాలను ఆరితేరిన మూర్తి. ధీరులకు గెలుపోటములు, దూరాభారాల లెక్కలు అవసరం వుండదు. నిరంతర సాధనే కార్యసాధకుల లక్ష్యం. పట్టుదల, అంకితభావం, సమర్థత, దురదృష్టి ఈ లక్షణాలు వున్న నాయకుడు వాటిని సానుకూలశక్తిగా ఉపయోగించుకొన్నప్పుడు ఎదురైన ప్రతిఓటమి, ప్రతి అవమానం విజయపథంలో నడిపించే ఇందనాలు అవుతాయి.. అంతటి ఘనుడు చంద్రబాబు. రాజకీయం అంటే అధికారం కోసం కాదు, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం పొందడం అంటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా డెభ్భై ఏళ్ల వయసులోనూ అలుపెరుగని యోధుడులా ముందుకు సాగుతున్న మహాపధికుడు.. చంద్రబాబు. 1956 నుండి రాష్ట్రరాజకీయ చరిత్రలో ఆయన సుధీర్ఘ అనుభవంతో పోల్చ గల  నాయకులు లేరు. పడి లేచే కడలి తరంగం లాంటి చంద్రబాబును ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా చూపేది ఆయనలోని వెన్ను చూపని ధీరత్వమే. ఆయన రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాదు.. స్వతంత్ర్య వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది. ఆయన రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఒడిదొడుకులు, ఆటు పోట్లు ఎదుర్కొన్న నాయకుడు చంద్రబాబు. పాలనా వ్యవహారాలన్నింటిలోనూ సమగ్ర అవగాహనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుచూపుతో పనిచేసే చంద్రబాబు వ్యక్తిత్వం ఎందరికో స్ఫూర్తిదాయకం. పరిమిత కాలంలో అపరమిత కృషితో ఒక సామాన్యుడు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చని నిరూపించిన చరిత్ర ఆయనది. నిరాశ చెందని తత్వం. అలసట ఎరుగని ధీరత్వం ఆయనది.
  కాంగ్రెస్ యువ నేతగా చంద్రబాబు (Photo; Twitter File)

  నిద్రలోనూ తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మర్చిపోకుండా పాటు పడే నాయకుడు.. చంద్రబాబు. తాను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి చరిత్ర సృష్టించి చారిత్రక అవసరాలు తీర్చగలిగిన వారు కోటికొక్కరే వుంటారు వారిలో చంద్రబాబు ఒకరు. ప్రజాసంక్షేమమే పరమావధిగా అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా స్థిత ప్రజ్ఞతతో ఒక ప్రత్యేక జీవన సరళి అనుసరిస్తున్న వ్యక్తి చంద్రబాబు. ముప్పై ఏళ్ల నాడు తొణికిసలాడిన ఉత్సాహమే డెభ్భై ఏళ్ల వయస్సులోను అదే ఉత్సాహం వురకలేస్తుంది ఆయనలో. ఈ వయస్సులోను విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. కాళ్ళకి చక్రాలు, కాలానికి రెక్కలు తొడిగిన అవిశ్రాంత పధికుడు చంద్రబాబు. నిరాశ, నిస్పృహలను దరిచేరనీయని ఆశావహుడు. గెలుపోటములకు పొంగి, కుంగి పోని స్థిత ప్రజ్ఞుడు, అవిరామ యోధుడు, అలుపెరుగని ధీరుడు. సర్వ స్వతంత్రుడు, మంచి ఆలోచనా పరుడు, ఉదార స్వభావి, ఆశావహ దృక్పథం ఆయనది.
  వైఎస్ రాజశేఖర్ రెడ్డితో చంద్రబాబు (Photo: Twitter (File))

  కఠోర శ్రమ, అకుంఠిత దీక్షకు చెరగని చిరునామా చంద్రబాబు. ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకొనే శ్రామికుడు. ప్రత్యర్థులు సైతం ప్రశ్నించడానికి వీలులేనంతగా కష్టపడే తత్వం ఆయనది. అధికారం అనుభవించడం కోసం కాకుండా ప్రజల కోసం ఆహరహం శ్రమించడం కోసమని విశ్వసించే అరుదైన నాయకుడు. భావి తరాల శ్రేయస్సు కోసం నిరంతర ఆలోచనలతో వినూత్న ప్రణాళికలను రూపొందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న కార్యదక్షుడు. తన దార్శనికతతో తెలుగు జాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్యచరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు చంద్రబాబు. ప్రపంచ రాజకీయ యువనికపై సుస్పష్టమైన ప్రణాళిక, దార్శనికత కలిగిన అతికొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్నచంద్రబాబు విశ్వ విద్యాలయంలో సామాజిక న్యాయం కోసం పొరాడి తొలి విజయం సాధించారు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొంది మార్చి 15 న శాసనసభ్యుడిగా చట్టసభలో తొలిసారి అడుగు పెట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్ళు.. మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారథి వరకు రాజకీయాల్లో ఎదగాలనుకొనే వారికి ఆదర్శ నాయకుడు.
  చంద్రబాబు(Photo: Twitter (File))

  ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారత రాజకీయాలలో అందరికంటే అనుభవజ్ఞుడైన సీనియర్ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్లు ప్రతిపక్ష నాయకుడుగా, విభజన అనంతరం నవ్యాంధ్రకు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న నాయకుడు వర్తమాన రాజకీయ చరిత్రలో లేరు. సమస్యలను సానుకూలంగా, సవాళ్లను అవకాశాలుగా తీసుకొని అడ్డంకులను ఎదిరించి, అవరోధాలను ఎదుర్కొని, ఆధునికతను పుణికిపుచ్చుకొని ముందుకు పోతూ ఈ చారిత్రక పాత్రని సమకాలిక అవసరాలను సమర్థంగా నిర్వహించిన నాయకుడు. ధీరులైన వారు అసంభవమైన అవరోదాలు ఎదురైనా ఎదుర్కొని నిరంతరం అపారమైన ఆత్మవిశ్వాసంతో అనంత సహనంతో శ్రేయ శిఖరానికి చేరుకుంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం, నిర్ధిష్ట లక్ష్యంతో ఫలితం సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు చంద్రబాబు. విభజన వేటు పడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిన కీలక తరుణంలో రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించడానికి అలుపెరుగని ఖర్మయోగిలా కార్యాచరణకి శ్రీకారం చుట్టారు.

  ఎవరు అవునన్నా, కాదన్నా చీకట్లు కమ్మిన ఆంధ్రప్రదేశ్‌‌లో వెలుగులు నింపిన చంద్రుడు చంద్రబాబే, సవాళ్ళకు సమాధానం చెప్పగల సమర్థ నాయకత్వంలో అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచింది. పీకల్లోతు కష్టాల్లోనూ ఏ వర్గానికి, ఏ రంగానికి లోటు రానివ్వకుండా ప్రభుత్వాన్ని నడిపి ప్రగతి బాట పట్టించారు. నిర్ధిష్ట లక్ష్యాలు నిర్దేశించుకొని ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేశారు. ఆ పునాదుల ద్వారా ఐదేళ్లలో రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు  667 దక్కాయి. పోలవరం ప్రాజెక్టు కు సీబీఐపీ 2018 అవార్డు దక్కింది. ప్రభుత్వం చేపట్టిన ఆర్టీజీఎస్ ఈ పరిపాలన చర్యలకు హిటాచీ పీపుల్స్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రపంచ బ్యాంకు, కేంద్ర పారిశ్రామిక శాఖ సంయుక్తంగా ఇచ్చే సులభతర వాణిజ్యం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 2016 -2017 వరుసగా దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది ఆంద్రప్రదేశ్. కూర్చోడానికి కుర్చీ లేని, పాలన మొదలు పెట్టడానికి నిలువ నీడలేని పరిస్థితుల్లో బస్సులో పడుకొని పాలన ప్రారంభించి కూడా ఆంద్రప్రదేశ్‌ని ప్రగతి బాట పట్టించారు చంద్రబాబు. నదుల అనుసంధానంలో విజయుడు. ఆన్ లైన్ అనుసంధానంతో సుపరిపాలకుడు. శూన్యంలోను పెట్టుబడులు రాబట్టిన సాధకుడు. రాష్ట్రాభివృద్ధిలో అలుపెరుగని శ్రామికుడు ఆయన. ఏమీ లేని ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల వ్యవధిలోనే రెండంకెల సుస్థిర వృద్ధిరేటు నిజంగా అపూర్వం, అనితర సాధ్యం. మనకున్న వనరులను వినియోగించుకొని లోటు బడ్జెట్ వున్నా రెండంకెల వృద్ధి రేటు సాధించగలిగారు.

  గోదావరి జలాలను కృష్ణాకు తరలించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపడితే ,అది ఒట్టి సీమ అని, కరెంటు ఖర్చు తప్ప ఎందుకు పనికి రాదని వెటకారాలు చేసిన వారికి అద్భుతం చూపించారు చంద్రబాబు. ఆయన సంకల్పం ముందు విమర్శలన్నీ వీగి పోయాయి. ఒక్క ఆలోచన డెల్టాలో సిరులు పండించింది. కరువు కరాళ నృత్యం చేసే భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. సీమ చెరువులు జలకల సంతరించుకొన్నాయి. వట్టి సీమ అని విమర్శించిన వారికి ఒక్క ఆలోచన సమాధానం చెప్పింది. తెలుగునాట సాగునీటి కష్టాలను శాశ్వతంగా నిర్మూలించేందుకు భావితరాల కోసం భగీరథ యత్నం చేశారు. దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టును దాదాపు 70 శాతం పూర్తి చేశారు చంద్రబాబు. భాగస్వామ్య సదస్సులు నిర్వహించి దాదాపు పదియేడు లక్షల కోట్ల పెట్టుబడులను ఒప్పందం చేసుకొని దేశంలోనే రికార్డు సృష్టించారు. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ రావడంతో అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతం రూపు రేఖలు మారిపోయాయి. కియా యాజమాన్యాన్ని ఒప్పిచేందుకు ఒక తపస్సులా బృహత్ ప్రయత్నం చేశారు చంద్రబాబు. కియా రాకతో కరువు సీమ కొత్త శోభను సంతరించుకొన్నది. ఆయన ప్రజలు తప్ప పేరు కోసం ఎప్పుడు పాకులాడలేదు. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా రాజధాని నిర్మించాలని, అంతర్జాతీయ యువనిక పై అమరావతి విజయ పతాకం ఎగరాలని, తెలుగు ప్రజల కల సాకారం చేయాలని చంద్రబాబు కలలు కన్నారు. ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముఫ్పై నాలుగు వేల ఎకరాల భూమి సమీకరణ ద్వారా ప్రభుత్వానికి అప్పగించడం అది చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతోనే. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు, ఎక్కడా రైతులు స్వచ్ఛందంగా వారి ప్రాణ ప్రదాలు అయిన భూములు ఇచ్చిన చరిత్ర లేదు. అర చేత గుడ్డిగవ్వ లేకుండా నమ్మకమే పెట్టుబడిగా రైతులు మనస్సు చూరగొని 34 వేల ఎకరాలు సేకరించి చరిత్ర సృష్టించారు చంద్రబాబు.

  అందరు భయపడే రోజుల్లో ఆర్థిక సంస్కరణలు బహిరంగంగా సమర్థించి సంస్కరణలు అమలు చేసి సంపద సృష్టికి బీజం  వేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఏమీ తెలియని రోజుల్లో  హైదారాబాద్‌లో ఐటీ రంగాన్ని నిర్మించడం చంద్రబాబుకే సాధ్యమైంది. భారీ వేతనాలతో కూడిన లక్షలాది ఉద్యోగాలు, ఏటా వేల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఇవన్నీ ఆనాడు సాధ్యమయ్యాయి అంటే ఆనాడు చంద్రబాబు కృషే కారణం. హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందంటే అది చంద్రబాబు కృషే. బెంగుళూరు, ముంబైతో పోటీపడి ఐటీ రంగాన్ని హైదరాబాద్ ఆకర్షించడాన్ని చంద్రబాబు చూపిన చొరవే కారణం. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నే కాక ప్రపంచ ఆర్థిక నిపుణులను ఆకర్షించాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లకు రూపకల్పన వంటి కార్యక్రమాలతో రాష్ట్ర అభివృద్దిని పరుగులు పెట్టించారు. ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య కొరకు ఎనలేని ప్రోత్సాహం అందించారు.

  1997లో స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆయన లోని మానవీయ కోణానికి ఉదారంగా నిలుస్తుంది. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా స్థాపించిన ఈ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య రంగ సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. విపత్తుల నిర్వహణ, పునరావాస చర్యలపై కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తున్నది. చంద్రబాబు ఆశయాలు, విధానాలు సామాన్యుల ప్రగతి కోసం ఏర్పరుచుకున్నవే. అందుకు స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళిక ఆయనది. అంతేకాదు 1996లో పెను తుఫాను కానీ, ఉత్తరాఖండ్ వరద భాధితులను ఆదుకోవడంలో, అమెరికా ప్రమాదం, ఆండీస్ పర్వత శ్రేణుల్లో మస్తాన్ బాబు విషాదం, ఒరిశా తుఫాను, హూద్ హూద్ తుఫాను, కర్నూలు వరదలు, తిత్లీ తుఫాను ఇలా ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడినప్పుడు తక్షణం స్పందించి తెలుగు ప్రజలకు అండగా నిలిచి ఆదికోవడంలోను చంద్రబాబు ముందుంటారని గిట్టని వారు సైతం అంగీకరిస్తారు. ప్రతిపక్షంలో వుండి కరోనా మహమ్మారి విరుచుకు పడటంపై  ఆందోళన చెందుతూ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ లాక్ డౌన్ మూలంగా ఇబ్బందులన్న వారిని ఆదుకోవాలని చూస్తున్నారు. టెలీ కాన్ఫరెన్సుల ద్వారా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బాధితులను ఆదుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. పొరుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు అంటే అభిమానించేవారు ఎందరో వున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అశేష అభిమానుల తరఫున చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు