HOME »NEWS »POLITICS »sp bsp ties in uttar pradesh without congress may have its impact on ap delhi and tamil nadu

ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఎఫెక్ట్...టీడీపీ, డీఎంకే, ఆప్‌లు కాంగ్రెస్‌కు షాక్ ఇస్తాయా ?

ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఎఫెక్ట్...టీడీపీ, డీఎంకే, ఆప్‌లు కాంగ్రెస్‌కు షాక్ ఇస్తాయా ?
రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని వ్యూహరచన చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ... ఉత్తరప్రదేశ్‌లోఎస్పీ, బీఎస్పీలతో కలిసి కూటమిగా ఏర్పడాలని భావించింది. అయితే కాంగ్రెస్ పార్టీని తమ కూటమిలోకి తీసుకోవద్దని గట్టిగా నిర్ణయించుకున్న ఈ రెండు పార్టీలు... హస్తం పెద్దలకు షాక్ ఇచ్చారు.

  • Share this:
    ఢిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందో డిసైడ్ చేసే కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అందుకే యూపీలో గెలవడమో లేక గెలిచే పార్టీలతో స్నేహం చేయడమో చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని వ్యూహరచన చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రకంగా ఆలోచించింది. ఉత్తరప్రదేశ్‌లో తాము సొంతంగా గెలిచే అవకాశాలు లేకపోవడంతో... ఎస్పీ, బీఎస్పీలతో కలిసి కూటమిగా ఏర్పడాలని భావించింది. అయితే కాంగ్రెస్ పార్టీని తమ కూటమిలోకి తీసుకోవద్దని గట్టిగా నిర్ణయించుకున్న ఎస్పీ, బీఎస్పీ అధినేతలు అఖిలేష్ యాదవ్, మాయావతి... కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సొంత స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీలను మాత్రమే వదిలిపెట్టాయి.

    బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని ఎస్పీ, బీఎస్పీలు స్పష్టం చేసినా... జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేతలు చెప్పడం మరో విశేషం. అయితే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు వ్యవహారం... ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.




    ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఉంటే... ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించేవి. అయితే యూపీలో కాంగ్రెస్‌కు బలం లేదని వ్యాఖ్యానించిన ఎస్పీ, బీఎస్పీ... ఆ పార్టీ తమ కూటమిని నుంచి దూరంగా ఉంచాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీ ఇదే రకంగా చేయబోతోందనే టాక్ వినిపిస్తోంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నా...రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ సుముఖంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది.

    ఒకవేళ టీడీపీ కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవద్దని అధికారికంగా నిర్ణయం తీసుకుంటే... ఢిల్లీలో ఆప్, తమిళనాడులో డీఎంకే కూడా అదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని ఇటీవల కామెంట్ చేసిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్... కాంగ్రెస్‌తో పొత్తుకు అంత సుముఖంగా లేరనే టాక్ వినిపిస్తోంది.

    ఇక తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే మధ్య పొత్తు ఖాయమనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. అయితే కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా తమకు పెద్దగా లాభం ఉండదని డీఎంకే భావిస్తే... వాళ్లు కూడా లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని దూరం పెట్టే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీతో డీఎంకే బంధం బలంగా ఉండటంతో... డీఎంకే, కాంగ్రెస్ కలిసే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
    First published:January 12, 2019, 16:53 IST