హోమ్ /వార్తలు /రాజకీయం /

Agriculture Act: వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కొత్త అస్త్రం.. సోనియా వ్యూహం ఇదే

Agriculture Act: వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కొత్త అస్త్రం.. సోనియా వ్యూహం ఇదే

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ(ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ(ఫైల్ ఫోటో)

వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ ఒకవేళ ఏ రాష్ట్రమైనా సొంతంగా బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టం ఆ రాష్ట్రంలో అమలుకాదు.

  కొత్త వ్యవసాయ బిల్లులపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓ వైపు రైతుల ఆందోళనలు.. మరోవైపు విపక్షాల విమర్శలతో.. కొత్త చట్టం దేశవ్యాప్తంగా సెగలు రేపుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు సోనియా గాంధీ కీలక సూచన చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను తిరస్కరించే మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆర్టికల్ 254 (2) అస్త్రాన్ని ప్రయోగించాలని ఆమె కోరారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని తిరస్కరిస్తూ.. ఆర్టికల్ 254(2) కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు అనంతరం రాష్ట్రపతి దగ్గరకు వెళ్తుంది. ఇక వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ ఒకవేళ ఏ రాష్ట్రమైనా సొంతంగా బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టం ఆ రాష్ట్రంలో అమలుకాదు. కాంగ్రెస్ ప్రస్తుతం ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.

  మరోవైపు రైతులు ప్రతిఘటిస్తున్నా బిల్లులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించడంపై.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ.. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మూడు సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కోత విధించడంతో పాటు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేశారు ప్రతాపన్. ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు.

  అంతేకాదు రైతుల కోసం ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సమాంతర మార్కెట్లకు అవకాశం ఇస్తే రైతుల దోపిడీకి గురవుతారని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై పంజాబ్‌ సీఎం అమరీందర్ సింగ్‌ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని.. కానీ రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఏకపక్షంగా బిల్లులను ఆమోదించారని ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

  మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం.. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020, నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020లను ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదం తర్వాత ఆ మూడు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లాయి. అయితే, వాటికి ఆమోదం తెలుపవద్దంటూ విపక్షాలకు చెందిన నేతలు రాష్ట్రపతి కోవింద్‌ను కలసి విజ్ఞప్తి చేశాయి. వాటిని మళ్లీ పార్లమెంట్ పునఃపరీశీలను పంపాలని కోరాయి. ఐనప్పటికీ ఆ మూడు బిల్లులకు ఆమోదముద్ర వేశారు రాష్ట్రపతి.

  ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత హర్‌సిమ్రత్ కౌర్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు బీజేపీతో తెగతెంపులు చేసుకొని.. ఎన్డీయే నుంచి అకాలీదళ్ బయటకొచ్చింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు పెద్దఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. కర్నాటక, తమిళనాడుల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Farmers, Farmers Protest, Sonia Gandhi

  ఉత్తమ కథలు