పార్లమెంట్ సమావేశాలకు దూరంగా సోనియా, రాహుల్ గాంధీ... కారణం ఇదే

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ

Parliament Sessions: సోనియాగాంధీ వైద్య చికిత్సలో భాగంగా చెకప్ కోసం విదేశాలకు వెళ్లారు. రాహుల్ గాంధీ కూడా తల్లి వెంట విదేశాలకు వెళ్లారు.

 • Share this:
  Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాయ్‌బరేలీ ఎంపీ సోనియాగాంధీ, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీలు పార్లమెంట్ సమావేశాలు మొదటి విడుతకు దూరంగా ఉండనున్నారు. వచ్చే సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోనియాగాంధీ వైద్య చికిత్సలో భాగంగా చెకప్ కోసం ఆమె విదేశాలకు వెళ్లారు. సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ కూడా తల్లి వెంట విదేశాలకు వెళ్లారు. సోనియాగాంధీ తిరిగిరావడానికి కనీసం రెండు వారాలు పట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ మధ్యలోనే ప్రియాంకా గాంధీ వాద్రా విదేశాలకు వెళ్తారు. అప్పుడు రాహుల్ గాంధీ భారత్‌కు తిరిగి వస్తారని సమాచారం. విదేశాలకు వెళ్లే ముందు సోనియాగాంధీ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీని కూడా రూపొందించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో పరస్పర సహకారం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలం కావడం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో గళం విప్పనుంది.

  ప్రతీకాత్మక చిత్రం


  విదేశాలకు వెళ్లడానికి ఒకరోజు ముందే పార్టీలో ప్రక్షాళన చేశారు సోనియాగాంధీ. హైకమాండ్ మీద నిరసనగళం వినిపించిన నేతలను పక్కన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షులు కాదని, పూర్తిస్థాయి అధ్యక్షులు కావాలంటూ సోనియాగాంధీని పరోక్షంగా విమర్శిస్తూ లేఖ రాసిన 23 మందిలో గులాం నబీ ఆజాద్ కూడా ఒకరు. పార్టీలో నేతలు కలసికట్టుగా ఉండాలంటూ పరోక్షంగా గాంధీల మీద విమర్శలు గుప్పించారు. గులాం నబీ ఆజాద్‌తో పాటు మోతీలాల్ ఓరా, అంబికా సోనీ, మల్లికార్జున ఖర్గేలను కూడా జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్‌లో అత్యున్నత నిర్ణయాలు తీసుకునే విభాగం అయిన సీడబ్ల్యూసీలో పి.చిదంబరం, తారిక్ అన్వర్, రణ్‌దీప్ సూర్జేవాలా, జితేంద్ర సింగ్ లాంటి వారికి రెగ్యులర్ మెంబర్స్‌గా చోటు దక్కింది. రాహుల్ గాంధీకి నమ్మినబంటు అయిన రణ్‌దీప్ సూర్జేవాలాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కర్ణాటక కాంగ్రెస్ ఇన్ చార్జిగా పగ్గాలు అప్పగించారు.

  Sonia Gandhi, Rahul Gandhi, spg, lok sabha, congress, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎస్పీజీ, లోక్ సభ, కాంగ్రెస్
  ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ


  ఇక తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జిగా తమిళనాడుకు చెందిన ఎంపీ మాణికం ఠాగూర్‌ను నియమించారు సోనియాగాంధీ. మాణికం ఠాగూర్ తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అయిన NSUIలో స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఆల్ ఇండియా ఎన్ఎస్‌యూఐ జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009లో తమిళనాడులోని విరుధానగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో మరోసారి విరుధానగర్ నుంచి రెండోసారి గెలుపొందారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: