ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం ను ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న దినసరి వేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైం మరియు పార్ట్ టైం సిబ్బంది సర్వీసులు క్రమబద్దీకరించాలని లేఖలో కోరారు. పాదయాత్రలో భాగంగా వీళ్లందరినీ క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. దినసరి వేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైం, పార్ట్ టైం ఉద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం వారి కంటే 15 ఏళ్ల తర్వాత నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు కమిటీని వేసిందని గుర్తు చేశారు. ఈ కమిటీకి తోడు సిఫార్సులు చేయడానికి మరో వర్కింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని సోము వీర్రాజు పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల దినసరి వేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ సిబ్బందికి అన్యాయం జరిగిందన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ ప్రధాన సలహదారుగా పనిచేసిన అజేయ కల్లం దృష్టికి తీసుకెళ్లగా... కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కమిటీకే ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. ఈ కమిటీ కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాల కోసమే పనిచేస్తుండటంతో దినసరి వేతన, పార్ట్ టైమ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారన్నారు.
గతంలో దినసరి వేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ సిబ్బంది సర్వీసులు క్రమబద్ధీకణ సమస్యను పరిష్కరించేందుకు 1993 నవంబర్ 25వ తేదీని కటాఫ్ గా నిర్ణయిస్తూ 1994లో అప్పటి ప్రభుత్వం జీవో నెం.112,212 జారీ చేసినట్లు సోము వీర్రాజు గుర్తు చేశారు. జీవో నెం.212 ద్వారా ఐదేళ్లు పూర్తి చేసిన ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ సిబ్బంది, జీవో నెం.112 ద్వారా పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన పార్ట్ టైమ్ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించారని.. కానీ ఈ సర్వీసులు పూర్తికాని వారికి మాత్రం లబ్ధి చేకూరలేదని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఇంకా క్రమబద్ధీకరణ కోసం 4,850 మంది ఫుల్ టైమ్ సిబ్బంది, 739 మంది పార్ట్ టైమ్ సిబ్బంది ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి1993 నవంబర్ 25కు ముందు వివిధ శాఖల్లో నిచేస్తున్న దినసరివేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ సిబ్బంది సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అలాగే 1993 నవంబర్ 15కు ముందు నియమించబడి సర్వీస్ క్రమబద్ధీకరణ కాకుండానే పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు, సర్వీస్ లో ఉండగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వాలని కోరారు.