ఏపీలో సోమువీర్రాజు దూకుడు.. మరో బీజేపీ నేతపై సస్పెన్షన్ వేటు

ఆదివారం తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో అంజిబాబును ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

news18-telugu
Updated: August 16, 2020, 8:49 PM IST
ఏపీలో సోమువీర్రాజు దూకుడు.. మరో బీజేపీ నేతపై సస్పెన్షన్ వేటు
సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)
  • Share this:
ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోమువీర్రాజు దూకుడు పెంచారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా మరో నేతను సస్పెండ్ చేశారు సోమువీర్రాజు. గుడివాక రామాంజనేయులు (అంజిబాబు)ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కడంతో ఆయన్ను పార్టీ నుంచి తొలగించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు సోమువీర్రాజు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో అంజిబాబు పాల్గొనడం సమాజానికి హానికరమని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఆయన చర్యలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ నేతలు చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని నేతలకు సూచించారు సోమువీర్రాజు.


గుడివాక రామాంజనేయులు 2019 లోక్‌సభ ఎన్నికల్లో మచిలీపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆదివారం తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో అంజిబాబును ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుడివాక రామాంజనేయులుతో పాటు మచ్చా సురేష్, కే.నరేష్, గంటా హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6లక్షలు విలువైన 1920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రామాంజనేయయులను ఏ-1గా పేర్కొన్నారు పోలీసులు.

ఇక ఇటీవల 3 రాజధానులపై ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓ.వీ. రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సోము వీర్రాజు. అంతేకాదు అమరావతి రైతుల పక్షాన బీజేపీ పోరాడలేకపోతోందని వ్యాఖ్యలు చేసిన వెలగపూడి గోపాలకృష్ణను కూడా పార్టీ నుంచి తొలగించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు సోమువీర్రాజు. బీజేపీలో ఉంటూ పార్టీ పరువు తీస్తున్న నేతలపై వరుసగా వేటు వేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 16, 2020, 8:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading