AP Elections Counting: వైన్ షాపులో చల్లని బీరు కావాలి.. ఓటుతో పాటు మందుబాబుల లెటర్ వైరల్...

బ్యాలెట్ పేపర్లో మందుబాబుల లేఖ

AP Parishath Election Results: ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందికి బ్యాలెట్ బాక్సులో తెల్లచీటి కనిపించింది. అందులో ఉన్న మేటర్ చూసి అందరూ షాకైయ్యారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. కౌంటింగ్ చేస్తున్న సిబ్బందికి కొన్నిచోట్ల విచిత్రమైన ఘటనలు ఎదురయ్యాయి. కొందరు ఓటర్లు బ్యాలెట్ పేపర్లతో పాటు తమ డిమాండ్లను బ్యాలెట్ బాక్సుల్లో వేయడం తరచూ జరుగుతుంటుంది. ఆదివారం జరిగిన కౌంటింగ్ లో సిబ్బందికి ఇదే అనుభవం ఎదురైంది. తమకు మంచి లిక్కర్ దొరకడం లేదంటూ ఓ మందుబాబు ఓటుతో పాటు ఓ చీటిని వేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం కేంద్రంలో బ్యాలెట్ బాక్సులో విచిత్రమైన లేఖ దర్శనమిచ్చింది. నల్లచెరువు యూత్ మందుబాబుల అధ్యక్షుడి పేరుతో ఉన్న ఆ లేఖలో.. “నల్లచెరువు వైన్ షాపులో కూలింగ్ బీర్లు పెట్టాలని కోరుతున్నా.. అలాగే షాపుల్లో మంచి బ్రాండ్లు పెట్టాలి.” అని రాశారు.

    కౌంటింగ్ సిబ్బంది ఆ లేఖను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. రాసిన వ్యక్తి ఎవరో తెలియదు గానీ.. ప్రస్తుతం ఇది నల్లచెరువులో ఓ హాట్ టాపిక్ గా మారింది. స్థానిక యువత అయితే మేం చేయలేని పని ఎవరో చేశారని సరదాగా చర్చించుకుంటున్నారట.

    ఇది చదవండి: వైసీపీలో ఇద్దరి యువనాయకుల మధ్య ఆధిపత్య పోరు... జగన్ కు తలనొప్పిగా మారిన వ్యవహారం


    ఈ ఏడాది మార్చిలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ కౌంటింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సులో ఇలాంటి లేఖ బయటపడింది. కర్నూలు జిల్లా నంద్యాలలోని 29వ వార్డులో ఓటర్ల లెక్కింపు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు చూసి కౌంటింగ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. తాము ఎందుర్కొంటున్న ఓ సమస్య గురించి కొందరు ఓటర్లు వినతిపత్రాలను బ్యాలెట్ బాక్సులో వేశారు.

    ఇది చదవండి: సీఎం జగన్ కు కానుకగా బాలాపూర్ లడ్డూ.., రికార్డు ధరకు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ..


    ఆ చీటీలో ఏముందంటే...!
    “నంద్యాల తాగుబోతుల విన్నపం.. విషయం: కర్నూలు జిల్లా నంద్యాల మండలం, నంద్యాల పురపాలక సంఘము. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నగారికి తాగుబోతుల యొక్క విన్నపం ఏమనగా.. కొత్త బ్రాంట్స్ (Ex: Supreme, Daru, Hyd, JUMBO etc..) ను తొలగించి ఓల్డ్ బ్రాండ్స్ (Ex: ROYAL STAG, Imperial Blue, BLACK DOG etc) ను అమ్మవలెనని విన్నపం. లేకపోతే మా యొక్క చివరి ఓటు కాగలవని విన్నవించుకుంటున్నాము.” అని పేర్కొన్నారు. ఈ లేఖ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    ఇలాంటి లేఖలను చూసిన కొందరు మందుబాబులు తమ కష్టాలు ఇలాగైనా బయటకు వచ్చాయని.. ఈ లేఖలను పరిగణలోకి తీసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని సరదాగా చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా ఏపీలో మందు బ్రాండ్లు, విక్రయాలపై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లేఖతో మరిన్ని జోకులు పేలడం ఖాయంగా కనిపిస్తోంది.
    Published by:Purna Chandra
    First published: