దేశంలో ఈవీఎంలపై రచ్చ కొనసాగుతోంది. ఓ వైపు ఎన్నికలు జరుగుతున్నా..మరోవైపు ఓటింగ్ యంత్రాలపై దుమారం జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచే ఎన్నికల సంఘం, ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేయవచ్చని..ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలను కలుపుకొని జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారు.
ఈ క్రమంలో ముంబైలో ఎన్సీపీ-కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేసిన ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి వచ్చిన వ్యక్తులు ఈవీఎంలను హ్యాక్ చేస్తారని బాంబు పేల్చారు. రూ.10 కోట్లిచ్చిన అభ్యర్థిని ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. ఏపీలో పోలింగ్ ముగిసినప్పటి నుంచీ ఇలా ఈవీఎంలే టార్గెట్‌గా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఐతే ఎన్నికల్లో ఓడిపోతామని తెలియడంతోనే ఈవీఎంలను తప్పుబడుతున్నారని వైసీపీ, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇవే ఈవీఎంలతో గెలిచారు కదా..అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈవీఎంలపై చేస్తున్న యుద్ధంపై కొందరు టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు తాము గెలుస్తామని చెబుతూనే.. మరోవైపు ఈవీఎంలపై ఆరోపణలు చేయడంలో అర్ధం లేదని లోలోపల వాపోతున్నట్లు సమాచారం. మరి ఒకవేళ టీడీపీ విజయం సాధిస్తే అప్పుడు ఈవీఎంలపై ఏం మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా ఈవీఎంలను హ్యాక్ చేసే గెలిచారా? అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెబుతారని అంటున్నారు. టీడీపీ ఖచ్చితంగా ఓడిపోతుందని ఫిక్సయ్యాకే.. చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న విమర్శల బాణాలు..రాబోయే రోజుల్లో దిశను మార్చుకొని తమకే తగులుతాయా? అని టీడీపీ నేతలు ఆందోళనలు చెందుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే అధికారం కోల్పోతుంది. అప్పుడు ఎలాగూ బాధ ఉంటుందని..కానీ గెలిచినా ఇబ్బందులు తప్పేట్టు లేవని మదనపడుతున్నారు తమ్ముళ్లు. అప్పుడు ఇతర పార్టీలు సంధించే ప్రశ్నలకు ఏ ముఖం పెట్టుకొని సమాధానం చెబుతామని కలవరపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, Chandrababu naidu, EVM, Evm tampering, Lok Sabha Election 2019, Tdp