2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకూ ఏర్పడిన రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా నడిపించారు. 2009లో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోవడంతో ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా వైఎస్ హయాంలో పనిచేసిన మెజారిటీ మంత్రులను కొనసాగించాయి.
ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడం తథ్యమన్న సర్వేల అంచనాల నేపథ్యంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం వైసీపీలో ఉన్న సీనియర్లు జగన్ కేబినెట్ లో స్ధానం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిలో కొందరు నేరుగా, మరికొందరు పార్టీ పెద్దల సహకారంతో అమాత్య హోదా కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ వీరికి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని సమాచారం. 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకూ ఏర్పడిన రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా నడిపించారు. 2009లో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోవడంతో ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా వైఎస్ హయాంలో పనిచేసిన మెజారిటీ మంత్రులను కొనసాగించాయి. వీరిలో చాలా మంది రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు. వీరంతా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు.
బొత్స సత్యనారాయణ వంటి కొందరు మాత్రమే 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ధర్మాన, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పార్ధసారధి వంటి వారు వైసీపీలో ఉన్నా 2014లో విజయం సాధించలేకపోయారు. కానీ ఐదేళ్లలో పరిస్ధితులు మారాయి. ఈసారి జగన్ ఇచ్చిన నవరత్నాల హామీ గట్టిగా పనిచేయడం, పలుసర్వే సంస్ధలు సైతం వైసీపీ విజయాన్ని నిర్ధారిస్తున్న నేపథ్యంలో వీరంతా ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈసారి వైసీపీ గాలి బలంగా వీచిందని అంచనా వేస్తున్న వైసీపీలోని మాజీ మంత్రులంతా మరోసారి అమాత్య హోదా కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈసారి ఎన్నికల్లో గతంలో వైఎస్ కేబినెట్ లో పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పార్ధసారధి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు ఇప్పటికే ఈ దిశగా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా కోస్తా ప్రాంతానికి చెందిన వారే కావడం మరో విశేషం.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన పలువురు మంత్రులు వివిధ పార్టీల్లో ఉండటమో, రాజకీయాల నుంచి విరమించుకోవడమో, లేక ఉన్న పార్టీల్లో క్రియాశీలకంగా లేకపోవడమో జరుగుతోంది. అప్పట్లో వైఎస్ కేబినెట్ లో రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన జేసీ దివాకర్ రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. వీరిలో జేసీ దివాకర్ రెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. వీరిలో శిల్పా మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే ప్రస్తుతం యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.
ఏరాసు ప్రతాప్‌రెడ్డికి ఈ సారి ఎన్నికల్లో టికెట్ కూడా దక్కలేదు. టీజీ వెంకటేష్ టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి తాజాగా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నా... అంత క్రియాశీలకంగా లేదు. తమ ప్రభుత్వం వస్తే డీఎల్ అంకుల్ కు తగిన గౌరవం కల్పిస్తామని మాత్రమే జగన్ మొన్నటి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు కూడా కేబినెట్ బెర్త్ అనుమానమే. ఎటొచ్చీ రాయలసీమ నుంచి పోటీలో ఉన్న వైఎస్ కేబినెట్ మంత్రుల్లో పెద్దిరెడ్డి, శిల్పామోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు.
అయితే జగన్ కేబినెట్ లో ఈసారి రాయలసీమ నుంచి గట్టి పోటీ ఉండొచ్చన్న ప్రచారం ఉంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాలు వైసీపీకి ఎప్పటి నుంచో గట్టి మద్దతు ఇస్తున్నాయి. దీంతో అక్కడ లెక్కకు మించి నాయకులు కూడా తయారయ్యారు. వీరిలో శిల్పా మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, అంజాద్ బాషాతో పాటు మరికొందరు నేతలు ఈసారి జగన్ కేబినెట్ లో బెర్తుల కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురికి జగన్ ఎన్నికలకు ముందే మంత్రి పదవుల హామీ ఇవ్వగా... మరికొందరు ప్రస్తుతం లాబీయింగ్ లో బిజీగా ఉన్నారు. వీరిలో జగన్ ఎవరికి అవకాశం కల్పిస్తారో చూడాల్సి ఉంది.
(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.