ప్రకాశ్ అంబేడ్కర్, ప్రకాశ్ రాజ్, స్టాలిన్.. మాతో ఇంకా చాలామంది ఉన్నారు : కేసీఆర్

కేసీఆర్ (File)

Telangana Loksabha Elections 2019 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ-అభివృద్ది పథకాలను చూసి ఓర్వలేక.. కేసీఆర్ ఎక్కడ ఢిల్లీ రాజకీయాలకు వస్తాడోనన్న భయంతో కొంతమంది లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

 • Share this:
  పాలమూరు ప్రజలు టీఆర్ఎస్‌ను దీవించి గెలిపిస్తే.. పదహారు ఎంపీలతో దేశ రాజకీయ గమనాన్నే మార్చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పదహారు ఎంపీలతో ఏం సాధిస్తావని కొంతమంది అడుగుతున్నారని.. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ సాధించామని గుర్తుచేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్, సినీ నటుడు, కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు ఇంకా చాలామంది తమ వెంట ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పుడే అన్ని విషయాలను బయటపెట్టబోమని చెప్పారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ నాగర్‌కర్నూలు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

  తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ-అభివృద్ది పథకాలను చూసి ఓర్వలేక.. కేసీఆర్ ఎక్కడ ఢిల్లీ రాజకీయాలకు వస్తాడోనన్న భయంతో కొంతమంది లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 150, కాంగ్రెస్‌కు 100 సీట్లు దాటవని.. ప్రాంతీయ పార్టీల నేత్రుత్వంలోని ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పాటువుతుందని ధీమా వ్యక్తం చేశారు. అందులో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.


  టీఆర్ఎస్ రాకముందు.. వచ్చిన తర్వాత పాలమూరు పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఒకసారి ఆలోచించాలని కేసీఆర్ కోరారు. కరెంట్ అప్పుడెలా ఇచ్చారు.. ఇప్పుడెలా ఇస్తున్నాం.. పెన్షన్ అప్పుడెంత.. ఇప్పుడెంత..? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 520 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ.1లక్షా 20వేలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మిషన్ భగీరథ కూడా పూర్తయి ప్రతీ ఇంటికి నల్లా నీరు వస్తుందన్నారు.

  రాబోయే కొద్ది రోజుల్లోనే పాలమూరు ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఇప్పుడు ఇస్తున్న 10లక్షల ఎకరాలకు తోడు మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే తనకు సర్వే రిపోర్ట్ అందిందని.. రెండు లక్షల పైచిలుకు ఓట్లతో తమ అభ్యర్థి రాములు గెలవబోతున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్‌కు పాలమూరు ఆశీర్వచనం కావాలని.. ఇందుకోసం తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.
  First published: