news18-telugu
Updated: March 29, 2019, 7:09 PM IST
రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ(ఫైల్ ఫోటో)
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న కథనాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో అమేథీలో ఓటమి తప్పదన్న భయంతోనే రాహుల్ గాంధీ అక్కడి నుంచి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నారని విమర్శించారు. అమేథీ ప్రజలు రాహుల్ గాంధీని నిరాకరించడం ఖాయమని, ఆ భయంతోనే దక్షిణాది నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణుల నుంచి ‘కృత్రిమ డిమాండ్’ చేయిస్తున్నారని విమర్శించారు. అమేథీ ప్రజలు రాహుల్ గాంధీని నిరాకరించడంతో ఆయన మరో నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.
అమేథీ నుంచి రాహుల్ గాంధీ పారిపోతున్నారంటూ #BhagRahulBhag అనే హ్యాష్‌ట్యాగ్‌తో స్మృతి ఇరానీ ఓ ట్వీట్ చేశారు. అమేథీ నుంచి పారిపోతూ ఇతర ప్రాంతాల్లో పోటీ చేయాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తున్నారు రాహుల్ గాంధీ. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని బీజేపీ బరిలోకి దింపింది. 2014లోనూ ఇక్కడ రాహుల్ గాంధీపై పోటీ చేసిన స్మృతి ఇరానీ లక్ష ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
Published by:
Janardhan V
First published:
March 24, 2019, 3:47 PM IST