ఏపీలో ఎన్నికల వేళ... రాజకీయపార్టీల్లో ‘అణు విద్యుత్’ సెగలు

ఏపీలో గత చరిత్ర చూస్తే అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం జరిగిన ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్నా లేకున్నా.... స్ధానికంగా కనిపించే అధికార పార్టీలపై, నేతలపై వీటి ప్రభావం పడుతోంది.

news18-telugu
Updated: March 15, 2019, 11:35 AM IST
ఏపీలో ఎన్నికల వేళ... రాజకీయపార్టీల్లో ‘అణు విద్యుత్’ సెగలు
అణువిద్యుత్ కేంద్రం (ఫైల్ ఫోటో)
  • Share this:
(సయ్యద్ అహ్మద్ ,  సీనియర్ కరస్పాండెంట్-న్యూస్ 18 తెలుగు)

ఉత్తరాంధ్రలో ఆరు అణు రియాక్టర్లను నెలకొల్పేందుకు భారత్-అమెరికా మధ్య తాజాగా కుదిరిన ఒప్పందం ఏపీలో రాజకీయ కాక రేపుతోంది. ఒబామా హయాంలో ప్రారంభమైన ప్రయత్నాలకు, తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో అణు ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో ఎన్నికల వేళ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపై 2005 నుంచే అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ సంస్ధతో చర్చలు జరుగుతున్నాయి. కానీ 2017లో తాము దివాలా తీసినందున ఈ ప్రాజెక్టు చేపట్టేలేమంటూ వెస్టింగ్ హౌస్ చేతులెత్తేయడంతో 2018 లో కెనడాకు చెందిన బ్రూక్ పీల్డ్ దీన్ని సొంతం చేసుకుంది. తాజా ఒప్పందం మేరకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆరు ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. గతంలో ఇదే జిల్లాలోని కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం జరిగిన ప్రయత్నాలకు స్ధానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికల వేళ అణు ప్లాంట్ల ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల తమకు తీవ్ర నష్టం తప్పదంటూ శ్రీకాకుళంతో పాటు పొరుగున ఉన్న విజయనగరం, విశాఖ జిల్లా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఉద్యమాలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఇరుకునపడ్డాయి. ఈసారి కేంద్ర, రాష్ట్రాల్లో ‌అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు కూడా అణుప్లాంట్ల సెగ తగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా అణు ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్రకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నించే అవకాశముంది. భారత్- అమెరికా మధ్య భారీస్ధాయిలో ఆరు అణువిద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం కుదిరినా... వీటి ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది, ఎంత మేర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్న దానిపై క్లారిటీ లేదు. అయినా ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యత చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు చౌకగా దొరికే సౌర విద్యుత్ లభ్యత కూడా పెరిగింది. అటువంటప్పుడు అణువిద్యుత్ అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

శ్రీకాకుళం జిల్లాలో స్ధానికులు కూడా తమ ఆరోగ్యానికి చేటు చేసే అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వద్దంటూ ఎప్పటినుంచో ఉద్యమాలు సాగిస్తున్నారు. అణుప్లాంట్ల ఏర్పాటు వ్యవహారంపై కొంతకాలంగా స్తబ్ధత నెలకొనడంతో ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోసారి ఈ డీల్ పూర్తయినట్లు అందుతున్న వార్తలు సిక్కోలు వాసుల్ని కలవరపెడుతున్నాయి.

ఏపీలో గత చరిత్ర చూస్తే అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం జరిగిన ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్నా లేకున్నా.... స్ధానికంగా కనిపించే అధికార పార్టీలపై, నేతలపై వీటి ప్రభావం పడుతోంది. అయినా దేశ భద్రత, ఇతరత్రా ప్రయోజనాల దృష్ట్యా వీటి ఏర్పాటు తప్పనిసరి అంటూ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యానాలు రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి అధికార పార్టీలపై అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు అంశం వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

First published: March 15, 2019, 10:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading