Telangana election 2019 | తెలంగాణలో చేవేళ్ల, మల్కాజ్ గిరి, నల్లగొండ, భువనగిరి స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ స్థానాలపై బీజేపీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్... అదే ఊపుతో లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ సీట్లలో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. చాలా స్థానాల్లో టీఆర్ఎస్కు సానుకూల పవనాలు కనిపిస్తున్నా... ఆరు స్థానాల్లో మాత్రం విపక్షాలు బలంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ను నిలువరించడానికి బదులుగా తమకు బలం ఉందని భావిస్తున్న స్థానాలపై కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువగా దృష్టి సారించడం కూడా టీఆర్ఎస్కు సవాల్‌గా మారిందనే ప్రచారం జరుగుతోంది. నాలుగు స్థానాలపై కాంగ్రెస్, రెండు స్థానాలపై బీజేపీ బలంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో చేవేళ్ల, మల్కాజ్ గిరి, నల్లగొండ, భువనగిరి స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ తరపున విజయం సాధించి... ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల బరిలో ఉన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తన గెలుపును ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. ఆర్థికంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి బలమైన అభ్యర్థి కావడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. ఇక సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరిలోనూ కాంగ్రెస్ తీవ్రంగా పోరాడుతోంది. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి బరిలో ఉండటం ఇందుకు ప్రధాన కారణం. గెలుపు కోసం రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
రాహుల్ గాంధీతో ఉత్తమ్( File)
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు గట్టిగా పోరాడుతున్నారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ తరపున వేంరెడ్డి నర్సింహారెడ్డి ఉన్నారు. ఆయనకు అంతగా రాజకీయ అనుభవం లేకపోవడం తనకు కలిసొస్తుందని ఉత్తమ్ భావిస్తున్నారు. ఇక భువనగిరి నుంచి కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావిస్తున్నారు. నియోజవకర్గం మొత్తం అనుచరగణం కలిగి ఉండటం... గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా గెలవడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కలిసొచ్చే అంశం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
కాంగ్రెస్ ఫోకస్ ఇలా ఉంటే... బీజేపీ కూడా రెండు సీట్లపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తమకు కంచుకోటగా ఉంటున్న సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని మరోసారి తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక మాజీమంత్రి, పాలమూరు నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణ బరిలో ఉన్న మహబూబ్ నగర్ నియోజకవర్గంపై బీజేపీ కన్నేసింది. ఇక్కడ టీఆర్ఎస్ తరపున కొత్త అభ్యర్థి రేసులో ఉండటం కూడా డీకే అరుణకు కలిసొచ్చే అంశమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి విపక్షాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్న సీట్లను టీఆర్ఎస్ ఏ విధంగా తమ ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.