ఏపీకి షాక్... తెలంగాణలో సింగపూర్ పెట్టుబడులు

సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం ఈరోజు మసబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో సమావేశమైంది.

news18-telugu
Updated: November 19, 2019, 6:24 PM IST
ఏపీకి షాక్... తెలంగాణలో సింగపూర్ పెట్టుబడులు
మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం
  • Share this:
సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం ఈరోజు మసబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూర్ మరియు తెలంగాణలో మద్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాల పైన చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి కాన్సుల్ జనరల్ తెలియజేశారు. ముఖ్యంగా పలు రంగాల్లో సింగపూర్ అనుభవాలను మరింతగా ఉపయోగించుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఐటి అండ్ ఈ రంగంలో శిక్షణ, ఫార్మ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం వంటి రంగాల్లో సింగపూర్ గణనీయమైన ప్రగతి సాధించిందని ఈ రంగాల్లో తెలంగాణకు సహకారం అందిస్తామని కాన్సుల్ జనరల్ ప్రతిపాదించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫార్మా క్లస్టర్ ను ఏర్పాటు చేస్తున్నదని, ఈ ఫార్మాసిటీ కోసం సింగపూర్ కు చెందిన సుర్బాన జరొంగ్ మాస్టర్ ప్లానింగ్ చేస్తున్నాదని మంత్రి తెలిపారు. కాలుష్య రహితంగా ఫార్మాసిటీ ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఈ మేరకు సింగపూర్ లాంటి దేశాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో గణనీయమైన పారిశ్రామిక ప్రగతి సాధించిందని, అనేక ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడులు తెలంగాణ కు తరలి వచ్చాయన్నారు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం అని మంత్రి తెలిపారు.

మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం


తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్-ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాల్లో ఒకటని తెలిపారు. దీంతోపాటు దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తూ వస్తున్నదని ఇలాంటి చోట పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని కాన్సుల్ జనరల్ కు మంత్రి కేటీఆర్ తెలిపారు. సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను వివరించేందుకు సింగపూర్ కంపెనీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మౌళిక వసతులను ఇక్కడి ఈకో సిస్టంని పరిశీలించేందుకు స్థానిక ఐటీ పార్కులు మరియు టి-హబ్ వంటి ప్రాంతాలను సందర్శించాలని కాన్సుల్ జనరల్ ను మంత్రి కోరారు. వచ్చే సంవత్సరం జరుగనున్న బయో ఏషియా సదస్సుకి సింగపూర్లోని ఫార్మ దిగ్గజాలను భాగస్వాములను చేసేందుకు కాన్సుల్ కార్యాలయం సహకరించాలని కోరారు.

ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు ప్రాధాన్యతల పట్ల మరింత స్పష్టత వచ్చిందని తెలిపిన కాన్సుల్ జనరల్, ఇక్కడి ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ఇక్కడి ప్రభుత్వ నాయకత్వాన్ని చూశాక సింగపూర్ లాంటి దేశాలకు చెందిన కంపెనీలు స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టేందుకు ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. ఈ మేరకు సింగపూర్ పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని మంత్రి కేటీఆర్ కి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

రాజధానిలో స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. రాజధానిలో 6.84 చ.కిమీ ల అభివృద్ధి కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగపూర్ కంపెనీల చంద్రబాబు హయాంలో ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సింగపూర్ కంపెనీలు పరస్పర అంగీకారంతో అమరావతి డెవలప్మెంట్ ప్రొజెక్ రద్దు చేస్తున్నట్లు ప్రస్తుత జగన్ ప్రభుత్వం ప్రకటించింది.ఏపీ సింగపూర్ విషయంలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంటే..మరోవైపు ఇదే సమయంలోె సింగపూర్‌ పెట్టుబడులు తెలంగాణ సర్కార్ ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Published by: Sulthana Begum Shaik
First published: November 19, 2019, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading