టీఆర్‌ఎస్‌లో నిరసన గళాలు.. అసలేం జరుగుతోంది..?

కేసీఆర్ (File)

ఇప్పటి వరకు కేసీఆర్ మాట జవదాటని నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారా? ఈ నిరసన గళాలు ఎందుకు ఎక్కువవుతున్నాయి? దీనికంతటికీ కారణం ఏంటి? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

  • Share this:
టీఆర్‌ఎస్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే టీఆర్ఎస్. పార్టీలో ఆయన మాటకు తిరుగులేదు. ప్రభుత్వంలోనూ ఆయన్ను కాదనేవారు లేరు. తెలంగాణే లక్ష్యంగా పార్టీని స్థాపించి.. తనదైన శైలిలో ఉద్యమాన్ని నడిపించారాయన. అదే ఊపులో తెలంగాణ గడ్డపై రెండు సార్లు వరుసగా తన పార్టీని గెలిపించుకున్నారు. అయితే, ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక నుంచి ఒక ఎత్తు కానుందా? ఇప్పటి వరకు కేసీఆర్ మాట జవదాటని నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారా? ఈ నిరసన గళాలు ఎందుకు ఎక్కువవుతున్నాయి? దీనికంతటికీ కారణం ఏంటి? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం పెరుగుతుండటమే అసమ్మతి పెరుగుదలకు ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారే కాకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం తాజా పరిస్థితులను గమనిస్తూ ఆందోళన చెందుతున్నారు. పార్టీలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అంటూ తమలో తాము చర్చించుకుంటున్నారు.

ఉద్యమ కాలంలో పనిచేసిన వారిని పక్కనబెట్టి.. మధ్యలో వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం లాంటి సంఘటనలు పార్టీలో నిరసనలకు అవకాశం కల్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్య మంత్రి, పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ఓ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాన్ని రంజుగా మార్చేశాయి. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఈటల.. ఆ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గులాబీ జెండా ఓనర్లం అని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో అసమ్మతి ఉందనడానికి ఉదాహారణగా వెల్లడిస్తున్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి పదవి దక్కలేదు. అప్పటి నుంచే పార్టీలో కొన్ని వర్గాలు అంసతృప్తిగా ఉన్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, వాటిని పార్టీ నేతలు, హరీష్ రావు.. ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. తాజాగా, ఆ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అసమ్మతి కచ్చితంగా ఉందని చెప్పవచ్చని కొందరు కోడై కూస్తున్నారు. ఓ సమావేశంలో మాట్లాడిన రసమయి.. ఈటల రాజేందర్, తాను మాత్రమే నిజాలు మాట్లాడతామని, ఉద్యమంలో కొట్లాడినోళ్లం అని అన్నారు. ఇంతలో కల్పించుకున్న ఈటల.. జాగ్రత్తగా మాట్లాడు అని అనగా.. ఏం కాదన్నా అంటూ ప్రసంగం కొనసాగించారు.

ఈ తాజా పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి స్థాయి మించి పోయిందని అవగతం అవుతోందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అయితే, అధికార పార్టీని ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా అని కాచుకొని కూర్చున్న ప్రతిపక్ష పార్టీలకు ఈ పరిణామాలు అస్త్రాలుగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఆపరేషన్ కమలం పేరిట రాజకీయ ప్రముఖులు, నేతలకు కాషాయ కండువా కప్పుతున్న ఆ పార్టీ టీఆర్‌ఎస్ పార్టీలో రగులుతున్న అసమ్మతిని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేవని వెల్లడిస్తున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published: