SHOULD CHANDRABABU NAIDU HAS TO COME DOWN ON SOME ISSUES TO MAKE ALLIANCE WITH JANASENA AK
TDP-Janasena: టీడీపీ, జనసేన మధ్య పొత్తు.. చంద్రబాబు తగ్గితేనే క్లారిటీ వస్తుందా..?
పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)
Chandrababu Naidu: టీడీపీతో పొత్తు విషయంలో జనసేన ముందుకు రావాలంటే అందుకు చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు టీడీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఇటీవల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి.. ఒంటరిగా వైసీపీని ఢీ కొట్టేందుకు టీడీపీ ఆసక్తి చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం తప్పేమీ కాదని.. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే టీడీపీ నుంచి పొత్తుల గురించి ఈ రేంజ్లో ప్రతిపాదనలు వస్తున్నా.. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. జనసేన నేతలు, కార్యకర్తల అభిప్రాయాల మేరకే పొత్తులపై నిర్ణయం ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి టీడీపీతో మళ్లీ పొత్తు ఉంటుందా ? లేదా ? అనే అంశంపై పవన్ కళ్యాణ్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారనే విషయం అర్థమవుతోంది.
అయితే టీడీపీతో పొత్తు విషయంలో జనసేన ముందుకు రావాలంటే అందుకు చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. రాబోయే రోజుల్లో పూర్తి రాజకీయాలకే పరిమితం కావాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్.. ఏపీ రాజకీయాల్లో కీలకమైన పాత్ర ఉండాలని భావిస్తున్నారు. ఇందుకోసం ముందుగా జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలని యోచిస్తున్నారు. ఏపీలో కింగ్ లేదా కింగ్ మేకర్ కావాలనే భావనలో ఉన్న పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత పొత్తు ఆఫర్‌పై అంతగా ఆసక్తి చూపకపోవడం వెనుక అసలు కారణం కూడా చంద్రబాబు వ్యాఖ్యలే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఆసక్తిగా ఉన్న చంద్రబాబు.. అదే సమయంలో మళ్లీ ముఖ్యమంత్రి తానే కావాలని అనుకుంటున్నారు.
తనకు గౌరవం ఇవ్వని ప్రస్తుత అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టబోనని.. మళ్లీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగానే సభకు వస్తానని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని పలుసార్లు కామెంట్ చేశారు. దీనిపైనే జనసేన అసంతృప్తితో ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తూనే.. మళ్లీ తాను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు అంటున్నారు. దీన్ని బట్టి జనసేన ఏపీలో రాజకీయ శక్తిగా ఉంటుందనే విషయాన్ని ఆయన గుర్తించడం లేదని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారట.
అందుకే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దానిపై ముందుగానే ప్రకటన చేయొద్దనే అంశానికి కట్టుబడి ఉండాలని జనసేన యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై టీడీపీ నుంచి ఓ స్పష్టత వచ్చేంతవరకు ఆ పార్టీతో పొత్తు గురించి సానుకూల సంకేతాలు ఇవ్వకూడదని జనసేన భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి టీడీపీతో పొత్తు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జనసేన.. చంద్రబాబు తగ్గితేనే తాము ముందుకు వస్తామనేలా ఉన్నట్టు అనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.