Roja Selvamani: రోజాకు షాక్, అమరావతికి జై కొట్టిన నగరి రైతులు

Amaravati Protest 250 days | అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ స్థానిక రైతులు చేస్తున్న ఆందోళన 250 రోజులు పూర్తి చేసుకుంది.

news18-telugu
Updated: August 23, 2020, 10:49 PM IST
Roja Selvamani: రోజాకు షాక్, అమరావతికి జై కొట్టిన నగరి రైతులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Nagari farmers support Amaravati protest | అమరావతి రైతులకు మద్దతుగా నగరి ప్రాంత రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మొక్కలు నాటి అమరావతికి రైతులకు మద్దతు ప్రకటించారు. ఆ తరువాత అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతు నాయకులు బ్రిటీష్ ప్రభుత్వం కంటే దారుణంగా జగన్ పాలన సాగుతోందన్నారు. 250 రోజులుగా అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే బ్రిటీష్ వాళ్లు అయినా స్పందించి ఉండేవారన్నారు. జగన్‌కు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దారుణం అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వాన్ని నగరి రైతులు డిమాండ్ చేశారు. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు జగన్ వాదనతో విబేధిస్తూ వచ్చారు. అయితే, తొలిసారి రైతులు, అదీ ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో రైతులు అమరావతికి మద్దతు పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఏపీ రాజధానిగా అమరావతి కోసం రైతులు ఆందోళనలు ఆదివారం నాటికి 250 రోజులకు చేరాయి.రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలకు దిగారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా... ఏపీ రాజధాని అమరావతిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కరోనా సమయంలోనూ రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళల నిరసనలు చేపట్టారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, దొండపాడు, పెదపరిమి, నెక్కళ్ళు, పొన్నెకళ్ళు, కిష్టయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెం,రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు,నేలపాడు, ఐనవోలు, శాఖమూరు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అన్ని దీక్షా శిబిరాలలో డప్పులు, పళ్ళెం, గరిట మోగించటం ద్వారా రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు 250వ రోజుకు చేరిన సందర్భంగా ఇవాళ అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం 7 గంటలకు ప్రతి శిబిరం వద్ద కాగడాల ప్రదర్శన చేపట్టారు. 5 కోట్ల ఆంధ్రుల వెలుగు అనే పేరుతో ఈ నిరసన కార్యక్రమాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. ఈ బిల్లుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతకాలు కూడా చేశారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ బిల్లు వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పింది. అయినా అమరావతి రైతులు మాత్రం తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్  చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దని స్పష్టం చేస్తున్నారు. గతంలో అమరావతిలో నిరసనలు తెలుపుతున్న రైతుల మీద ఎమ్మెల్యే రోజా విమర్శలు చేయడంతో ఆమెను నిరసనకాారులు ఘెరావ్ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 23, 2020, 10:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading