సీనియర్ రాజకీయ కుటుంబం అయిన రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీలో రాజకీయ చీలక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. నర్సరావుపేట నుంచి టీడీపీ ఎంపీగా బరిలో ఉన్న రాయపాటి సాంబశివరావు అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాస్ ఆయన తనయుడుతో సహా టీడీపీని వీడి.. వైసీపీలో చేరుతున్నారని సమాచారం. 2014 ఎన్నికల సమయంలో రాయపాటి సోదరులు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఆయన ఆ ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటికే రాయపాటి సాంబశివరావు పోలవరం నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉన్నారు. అక్కడ నష్టాలు వచ్చాయని చెబుతారు. ఇక, ఆయన సోదరుడు రాయపాటి శ్రీనివాస్‌కు టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు.
తాజా ఎన్నికల సమయంలో రాయపాటికి తిరిగి నర్సరావుపేట ఎంపీ సీటు ఇవ్వటానికి తొలుత అంగీకరించలేదు. తనతో పాటు తన కుమారుడు రంగారావుకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. కానీ, రాయపాటి పార్టీ వీడుతారనే వార్తల నడుమ తిరిగి రాయపాటికి నర్సరావుపేట ఎంపీ సీటు ఖరారు చేశారు. ఆయన తనయుడికి మాత్రం ఎక్కడా సీటు లభించలేదు. దీంతో..సోదరుడు రాయపాటి శ్రీనివాస్ కుటుంబం టీడీపీ పైన అసంతృప్తితో ఉన్నారు.

రాయపాటి సాంబశివరావు సోదరుడు రాయపాటి శ్రీనివాస్
సోదరుడు కుటుంబం వైసీపీలోకి..!
రాయపాటి సాంబశివరావు సోదరుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయించినట్లు చెబుతున్నారు. తాజాగా రాయపాటి శ్రీనివాస్ కుమారుడు.. గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయికృష్ణ టీడీపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, టీడీపీలను ఏ1, ఏ2లుగా నిందిస్తూ ఏ3, ఏ4 అంటూ జనసేన, బీజేపీపై ఆరోపణలు చేశారు. టీడీపీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై గళం ఎత్తుతానని మోహన్ సాయికృష్ణ చెప్పడం హాట్‌టాపిక్ అయింది. దీంతో.. ఇప్పుడు రాయపాటి శ్రీనివాస్ కుటుంబం టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గుంటూరు నగర మేయర్‌గా పనిచేసిన ఆయన ఇప్పుడు అదే సీటుపై ఆశలు పెట్టుకున్నారని, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న వేళ ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
(రఘు అన్నా, గుంటూరు జిల్లా కరస్పాండెంట్, న్యూస్18)Published by:Ashok Kumar Bonepalli
First published:May 11, 2019, 20:46 IST