నరసరావుపేట ఎంపీ బరిలో తెరపైకి కొత్తపేరు.. రాయపాటి పరిస్థితి ఏంటి?

నరసరావు పేటలో సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్థానంలో కొత్తగా భాష్యం రామకృష్ణ‌ను రంగంలోకి దించాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 18, 2019, 6:26 PM IST
నరసరావుపేట ఎంపీ బరిలో తెరపైకి కొత్తపేరు.. రాయపాటి పరిస్థితి ఏంటి?
రాయపాటి సాంబశివరావు file
  • Share this:
గుంటూరు జిల్లాలో టీడీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నరసరావు పేటలో సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్థానంలో కొత్తగా భాష్యం రామకృష్ణ‌ను రంగంలోకి దించాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావును గుంటూరు పశ్చిమ నియోజవకర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా ప్రకటించిన మద్దాల గిరిని నరసరావుపేటకు మార్చాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతం ఈ మార్పులు పరిశీలనలో ఉన్నాయని, చంద్రబాబు నిర్ణయం తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. 126 మంది ఎమ్మెల్యేలతో తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ, 15 మందితో రెండో లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇక మిగిలిన 34 సీట్లలో ఎవరిని బరిలో దింపాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ కూడా విడుదలైనందున రెండు రోజుల్లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అభ్యర్థులపై కూడా చంద్రబాబు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నరసరావుపేట నుంచి కృష్ణదేవరాయలుని పోటీకి నిలిపారు. దీంతో ఆ స్థానం ఫుల్ అయిపోయినట్టే. గుంటూరు నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బరిలోకి దింపారు. రాయపాటి సాంబశివరావు తనకు ఎంపీ సీటుతోపాటు తన కుమారుడికి సత్తెనపల్లి (అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శివప్రసాద్) అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, నరసరావుపేటలో ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడి టికెట్ విషయాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు రాయపాటి ప్లేస్‌లోకి భాష్యం రామకృష్ణను తీసుకురావాలనుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబుతో భాష్యం రామకృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేరళ వరద బాధితుల సహాయార్థం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రూ.2 .7 కోట్ల విరాళాన్ని సైతం అందజేశారు. ఏపీలో ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటైన అన్న క్యాంటీన్ల నిర్వహణకు భాష్యం రామకృష్ణ కుమారుడు సాకేత్‌రామ్‌ రూ.27లక్షల విరాళం అందజేశారు.

First published: March 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు