ఈ ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. ‘ఇన్నాళ్లూ ఎదురుచూస్తున్న నిర్ణయం వచ్చింది. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేతో చర్చించిన తర్వాత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. త్వరలో కోల్‌కతా వస్తున్నాం. జై హింద్.’ అంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె పదవీకాలం ఈ ఏడాది మే 30తో ముగుస్తుంది. అప్పటి లోపు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్‌తో కలసి అసోం, పశ్చిమ బెంగాల్లో వచ్చే వారం పర్యటించనున్నారు. రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్ల మీద చర్చించనున్నారు.
పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున వ్యూహాన్ని రచిస్తోంది. టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కమలం కండువా కప్పుతున్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన సుబేందు అధికారితో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులను కమలం గూటికి చేర్చారు. ఇక బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు టీఎంసీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీకి గుడ్ బై కొడతారని ప్రచారం జరగడంతో టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్‌కు ఊహించని విధంగా పార్టీ ఉపాధ్యక్షురాలు పదవిని కట్టబెట్టారు.
తాజాగా తాము కూడా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నామని శివసేన చెప్పడంతో బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకి గుడ్ న్యూస్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, హిందూత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీకి పడుతుందని మమతా బెనర్జీ భావిస్తే, ఇప్పుడు శివసేన ఎంట్రీతో ఆ పార్టీ కూడా కొంత ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని ఉంటే అంత మంచిదని భావిస్తోంది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇతర పార్టీలకు చీలుతుందని, తమ ఓటు బ్యాంక్ తము పడుతుందని అంచనా వేస్తోంది. అదే సమయంలో తాము కూడా ఎన్నికల బరిలో ఉన్నామంటూ ప్రకటించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్‌లో మెల్లగా ఎదుగుతున్న మజ్లిస్ పార్టీ ఇప్పుడు బెంగాల్లో అడుగుపెడితే అది తమకే లాభిస్తుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 17, 2021, 20:43 IST