news18-telugu
Updated: October 29, 2019, 8:38 PM IST
ఉద్దవ్ థాక్రే- ఫైల్ ఫొటో
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 50-50 ఫార్ములాకు శివసేన డిమాండ్ చేస్తుండటం, ఆ ప్రసక్తే లేదని బీజేపీ చెబుతుండటం.. ఆ రాష్ట్ర రాజకీయాలను ఆసక్తిగా మార్చింది. అయితే, చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకుందామని ఇరు పార్టీలు భావించాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు శివసేనకు ఆగ్రహం తెప్పించాయి. ‘2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు శివసేనకు సీఎం పీఠం షేరింగ్‌పై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఫడ్నవీస్ తెలిపారు. తానే ఐదేళ్ల పాటు సీఎం కుర్చీలో కూర్చుంటానని స్పష్టం చేశారు.’ దీంతో శివసేన నొచ్చుకుని, ఈ రోజు సాయంత్రం జరగాల్సిన చర్చలకు దూరంగా ఉంది. దీంతో ఆ చర్చలు వాయిదా పడ్డాయి. అమిత్‌షా ఇచ్చిన హామీకి ఫడ్నవీస్ తూట్లు పొడిచారని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. జాతీయ అధ్యక్షుడి హామీకి రాష్ట్ర నేతలు విలువ ఇవ్వనపుడు తాము వారితో ఎందుకు చర్చలు జరపాలని ఉద్ధవ్ ఠాక్రే భావించారని సంజయ్ వెల్లడించారు. అందుకే చర్చలు రద్దు చేసినట్లు చెప్పారు.
మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనకు మధ్య సీఎం పదవి గురించే చర్చ నడుస్తోంది. దీనికోసం మంగళవారం సాయంత్రం 4 గంటలకు చర్చలు జరుపుకోవాలని రెండు పార్టీలు తొలుత నిర్ణయించుకున్నాయి. కానీ.. చర్చలు రద్దయ్యాయి. ఈ చర్చలు బుధవారం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నా, అది కూడా డౌటేనని శివసేన వర్గాలు తెలిపాయి.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
October 29, 2019, 8:38 PM IST