• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • SHIROMANI AKALI DAL QUITS BJP LED NDA OVER CONTROVERSIAL FARM BILLS

SAD Quits NDA: బీజేపీకి షాక్...ఎన్డీయే కూటమికి శిరోమణి అకాలీదళ్ గుడ్‌బై

SAD Quits NDA: బీజేపీకి షాక్...ఎన్డీయే కూటమికి శిరోమణి అకాలీదళ్ గుడ్‌బై

ఎన్డీయే కూటమికి శిరోమణి అకాలీదళ్ గుడ్ బై

ఎన్డీయే కూటమికి బీజేపీ చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ గుడ్‌బై చెప్పింది. వివాదాస్పద వ్యవసాయ బిల్లులను కారణంగా చూపుతూ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్లు శిరోమణి అకాలీదల్ శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.

  • Share this:
    బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి శిరోమణి అకాలీదళ్ గుడ్‌బై చెప్పింది. వివాదాస్పద వ్యవసాయ బిల్లులను కారణంగా చూపుతూ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్లు శిరోమణి అకాలీదల్ ప్రకటించింది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానాలో రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదల్‌కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి గత వారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమితోనూ తెగతెంపులు చేసుకుంటూ  ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకోవడం జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ-శిరోమణి అకాలీదళ్ పార్టీలు చాలా ఏళ్లుగా మిత్రపక్షాలుగా ఉన్నాయి. గతంలో శివసేన ఎన్డీయేకి దూరమైనట్లే...ఇప్పుడు శిరోమణి అకాలీదళ్ కూడా బీజేపీకి దూరంకావడం పంజాబ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

    వివాదాస్పద వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒప్పించేందుకు శాయశక్తులా కృషి చేశామని..అయితే ఈ విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.



    రైతులకు బాసటగా నిలుస్తూ వ్యవసాయ బిల్లులను వెనక్కి తిప్పిపంపాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను అకాలీదళ్ ఇది వరకే కోరింది. పంజాబ్ రైతులకు బాసటగా నిలుస్తూ ఎన్డీయే కూటమికి అకాలీదల్ గుడ్ బై చెప్పాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. అధికార దాహంతోనే అకాలీదళ్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీతో అంటకాగుతోందని ఆరోపించారు. చిల్లర రాజకీయాల కోసం పాకులాడకుండా...రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని అమరీందర్ సింగ్ పిలుపునిచ్చారు.  దీంతో ఎన్డీయే నుంచి వైదొలగేలా అకాలీదళ్‌పై తీవ్ర రాజకీయ ఒత్తిడి ఏర్పడింది.

    వ్యవసాయ బిల్లులతో పాటు బీజేపీతో పొత్తు కారణంగానే పంజాబ్‌లో పార్టీ బలహీనపడుతోందన్న కారణంగా శిరోమణి అకాలీదళ్ ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
    Published by:Janardhan V
    First published:

    అగ్ర కథనాలు