కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై పొగడ్తల వర్షం కురిపించారు ఆ పార్టీ సీనియర్ నేత , కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్. పార్టీలో ప్రియాంక గాంధీ పోషిస్తున్న పాత్ర...భవిష్యత్తులో మరింత విస్తృతమవుతాయన్నారు. ముందుముందు ఆమె ప్రభావం పార్టీలో మరింత పెరగనుందన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజలను ఆకట్టునేలా ప్రియాంక హిందీలో సరళంగా మాట్లాడగలరన్నారు శశిథరూర్. ఇందిరాగాంధీకి పరిచయమున్న చాలా మంది వ్యక్తులు ఆమెకు ఇంకా గుర్తు ఉన్నారన్నారు. వారితో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె కలిసిపోతారన్నారు. ఈ లక్షణాలన్నీ రాజకీయాల్లో ఆమె మరింత ముందుకు వెళ్లడానికి దోహదం చేస్తాయన్నారు శశిథరూర్. ఆమెకు ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందన్నారు.

ప్రియాంక గాంధీ
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా అక్కడ పార్టీ పరిస్థితి చక్కబెట్టాలని కాంగ్రెస్ భావించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ జనవరిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటీవల మూడు రోజుల గంగా యాత్రతో యూపీలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ప్రియాంక గాంధి.
ఇదిలా ఉంటే యూపీలో ప్రియాంక గాంధీ పర్యటన పట్ల బీజేపీ వీలుదొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై బీజేపీ నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు. జనాకర్షక నేతలు లేకనే కాంగ్రెస్ చాక్లెట్ ఫేస్వంటి ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకొచ్చిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర దుమారం రేపాయి.