మహారాష్టలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన శివసేనకు షాక్ తగిలింది. తాము ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, తమకు 48 గంటలు గడువు కావాలని శివసేన నేత ఆదిత్య థాక్రే, మరికొందరు నేతలు గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలసి విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ వినతిని గవర్నర్ తిరస్కరించారు. శివసేన ప్రతినిధులు గవర్నర్ను కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సుముఖత తెలిపారు. కానీ, వారు ప్రభుత్వ ఏర్పాటుకు కావాలసిన సంఖ్యాబలంతో కూడిన లేఖను అందించలేదు. పైగా, గడువు పూర్తయ్యాకు మద్దతు లేఖలు అందించడానికి మూడురోజులు సమయం కావాలని కోరారు. అయితే, డెడ్లైన్ పొడిగించలేమని గవర్నర్ నిస్సహాయత వ్యక్తం చేశారు.
రాజ్ భవన్ నుంచి విడుదలైన లేఖ
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరిపింది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఫోన్లో మాట్లాడారు. శివసేన ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందిగా కోరారు. ఈ అంశంపై పార్టీ సీడబ్ల్యూసీలో చర్చించిన కాంగ్రెస్ పెద్దలు శివసేన ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలని భావించినట్టు సమాచారం. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రభుత్వంలో భాగం చేసి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెరో డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలనే చర్చలు కూడా జరుగుతున్నాయి.