సెలెక్ట్ కమిటీ ఫైల్ని శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపింది. దీంతో మళ్లీ శానసమండలి చైర్మన్ వద్దకు ఫైలు చేరింది. రూల్ 154 కింద కమిటీ వేయడం చెల్లదని ఫైలు మీద రాసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శాసనమండలి కార్యదర్శిని టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పక్షాలు కలిశాయి. రూల్ 154 కింద చైర్మన్ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే కమిటీ వేయాల్సి ఉంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. చైర్మన్ నుంచి ఫైలు వచ్చిన వెంటనే కమిటీ వేయని పక్షంలో ఈ సారి మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఉదయం నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు.

శాసనమండలి కార్యాలయ సెక్రటరీని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్సీలు
మరోవైపు సీఆర్డీయే బిల్లు రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు విషయంలో ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీ వివాదం ఇంకా కొనసాగుతోంది. దీనికోసం టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, నాగజగదీష్, అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు తదితరులు మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను కలిశారు. సెలక్ట్ కమిటీని తక్షణం వేయాలని, దానికి సంబంధించి ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శిని కోరారు.

బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నానంటూ చైర్మన్ ప్రకటించిన రోజు శాసన మండలిలో దృశ్యాలు
రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ శాసనమండలిలో చర్చల నేపథ్యంలో.. సెలెక్ట్ కమిటీ కోసం మండలి ఛైర్మన్ షరీఫ్‌కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలెక్ట్ కమిటీలో తాము ఉండబోమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని అధికారపార్టీకి చెందిన నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలు రాశారు.
సీఆర్డీఏ రద్దు బిల్లుపై ఏర్పాటైన సెలక్ట్ కమిటీకి ప్రతిపాదిత సభ్యులు
టీడీపీ నుంచి...
జి.దీపక్ రెడ్డి, అనంతపురం
బచ్చుల అర్జునుడు, కృష్ణా
బీద రవిచంద్ర, నెల్లూరు
గౌనివారి శ్రీనివాసులు, చిత్తూరు
బుద్దా నాగ జగదీశ్వర్ రావు, విశాఖపట్నం
బీజేపీ నుంచి సోమువీర్రాజు
పీడీఎఫ్ నుంచి ఇళ్ల వెంకటేశ్వరరావు
రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై ఏర్పాటైన సెలక్ట్ కమిటీకి ప్రతిపాదిత సభ్యులు
టీడీపీ నుంచి...
నారా లోకేశ్, గుంటూరు
అశోక్ బాబు, కృష్ణా
తిప్పేస్వామి, అనంతపురం
బీటీ నాయుడు, కర్నూలు
సంధ్యారాణి, విజయనగరం
బీజేపీ నుంచి మాధవ్
పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు