విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలే భావి రాజకీయ నాయకులకు పుట్టినిల్లు. విద్యార్థి నాయకులే ఆ తర్వాత రాజకీయ నాయకులుగా ఎదిగిన ఉదాహరణలెన్నో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశమంతా ఎక్కడ వెతికినా రాజకీయ నేతలుగా మారిన విద్యార్థి నాయకులు కనిపిస్తారు. భారతీయ జనతా పార్టీకి చెందిన కిషన్ రెడ్డి కూడా విద్యార్థి నాయకుడే. సరిగ్గా ఆరు నెలల క్రితం ఎమ్మెల్యేగా ఓడిపోయిన కిషన్ రెడ్డి... లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. అంతేకాదు... ఇప్పుడు మోదీ కేబినెట్లో బెర్త్ దక్కింది. కేంద్ర మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డికి చోటు దక్కడం విశేషం. జనతా పార్టీలో మొదలైన కిషన్ రెడ్డి ప్రయాణం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. అయితే ఉన్నత పదవి వరించడంతో పాటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే బాధ్యత కిషన్ రెడ్డిపై పెరిగింది.

కిషన్ రెడ్డి
జి.కిషన్ రెడ్డి... 1964 మే 15న రంగారెడ్డి జిల్లా తిమ్మాపురంలో జన్మించారు. ఆయనది మొదట్నుంచీ సంఘ్ భావజాలమే. సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన కిషన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 1977లో జనతా పార్టీ యూత్ వింగ్‌లో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. 1980లో జన్‌సంఘ్ నుంచి బీజేపీ ఏర్పడినప్పుడు కిషన్ రెడ్డి పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. 1980-81 కాలంలో భారతీయ జనతా యువ మోర్చా రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. 1982-83 కాలంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కోశాధికారిగా సేవలందించారు. 1983-84 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1986-90 మధ్య భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్రాధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేయడం విశేషం. 1990-92 మధ్య భారతీయ జనతా యువ మోర్చా దక్షిణ భారతదేశ ఇంఛార్జ్‌గా, అఖిల భారత కార్యదర్శిగా సేవలందించారు. 1992-94 మధ్య భారతీయ జనతా యువ మోర్చా అఖిల భారత ఉపాధ్యక్షుడి పదవి వరించింది. 1994-2001 మధ్య ఏడేళ్లపాటు వరుసగా మూడు పర్యాయాలు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగడం విశేషం. జూలై 2001- ఆగస్ట్ 2002 మధ్య పార్టీలో కీలక పదవులు వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2002 - 2004 కాలంలో భారతీయ జనతా యువ మోర్చా జాతీయాధ్యక్షుడిగా సేవలందించారు.

కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
దశాబ్దాల పాటు పార్టీలో సేవలు అందించిన కిషన్ రెడ్డి... ఇక చట్టసభల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. 2004లో హిమాయత్‌నగర్ అసెంబ్లీకి పోటీ చేసి 32 వేల మెజార్టీతో గెలిచారు. తెలంగాణ ప్రాంతంలో బీజేపీ గెలిచిన ఏకైక సీట్ హిమాయత్నగరే. 2004-09 మధ్య కాలంలో బీజేఎల్పీ ఫ్లోర్‌లీడర్‌గా కిషన్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత 2009, 2014లో అంబర్‌పేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. 2010లో బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండు విడతలు పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు. పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా, బీజేఎల్పీ ఫ్లోర్‌లీడర్‌గా కిషన్‌రెడ్డికి ఉమ్మడి ఏపీలో మంచి గుర్తింపు వచ్చింది. 2012లో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ పోరు యాత్ర ప్రారంభించి 22 రోజుల పాటు వివిధ జిల్లాల్లో పర్యటించారాయన.

కిషన్ రెడ్డి
మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన కిషన్ రెడ్డికి లోక్‌సభలో అడుగుపెట్టాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. వాస్తవానికి 2014లోనే సికింద్రాబాద్ ఎంపీ సీటుకి పోటీ చేయాలనుకున్నారు. అప్పట్లో పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయతో ఈ సీటు విషయమై తీవ్రమైన పోటీ నెలకొంది. ఇద్దరు నేతలు ఢిల్లీ స్థాయిలో సికింద్రాబాద్ సీటు కోసం పట్టుబట్టారు. అయితే చివరకు ఆ సీటు బండారు దత్తాత్రేయకే అధిష్టానం కేటాయించడంతో కిషన్ రెడ్డి... అంబర్‌పేటలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన మెదక్ ఎంపీ స్థానంలో పోటీ చేయాలని కిషన్ రెడ్డి భావించారు. అప్పుడూ అదృష్టం వరించలేదు. బీజేపీ అధిష్టానం జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చింది. దాంతో ఎమ్మెల్యేగానే కొనసాగారు. 2018లో తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అంబర్‌పేట నుంచి పోటీ చేశారు. అంబర్‌పేటలో హ్యాట్రిక్ ఖాయమని అనుకున్నా... టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో వెయ్యి ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎప్పట్నుంచో లోక్‌సభకు పోటీచేయాలనుకుంటున్న కిషన్ రెడ్డికి 2019 ఎన్నికలు అవకాశాన్నిచ్చాయి. తాను 2014లో కోరుకున్న సికింద్రాబాద్ సీటు లభించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్‌ను ఓడించి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు కిషన్ రెడ్డి. నాలుగు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి వివిధ హోదాల్లో సేవలు అందిస్తూ వచ్చిన కిషన్ రెడ్డికి మరోసారి తగిన గుర్తింపు లభించింది. కేంద్ర మంత్రి పదవి వరించింది.
నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి
ఇవి కూడా చదవండి:
SBI Warning: మోసపోతారు జాగ్రత్త... ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరికలు
ONGC Jobs: ఓఎన్జీసీలో 107 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Jobs: బెనారస్ హిందూ యూనివర్సిటీలో 439 ఉద్యోగాలుPublished by:Santhosh Kumar S
First published:May 30, 2019, 17:20 IST