సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ రసవత్తరంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ బరిలో వున్నాయి. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో వెళుతోంది. మరోవైపు పట్టు నిలబెట్టుకోవడానికి కమలదళం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి సికింద్రాబాద్ బరిలో నిలిచిన కిషన్ రెడ్డి న్యూస్18తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఎన్నికలు కేంద్రానికి సంబంధించిన ఎన్నికలని టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు ప్రధాని కావాలని కోరికగా ఉందని, అది కలలో కూడా సాధ్యం కాదన్నారు. ఎంఐఎం సహకారంతో కేసీఆర్ విషపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్లో నిర్వహించిన విజయ్ సంకల్ప సభలో ప్రధాని మోదీ, కిషన్ రెడ్డి
16 ఎంపీ సీట్లు గెలిస్తే ఒరిగేదేమిటో
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రాన ఒరిగేదేమిటో చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గత లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఎంపీలను చేర్చుకున్నాక ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ బలం 15 ఎంపీలకు చేరుకున్నా రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్ మళ్లీ బీజేపీదే...
సికింద్రాబాద్ స్థానం మళ్లీ బీజేపిదే అని కిషన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బుని నమ్ముకొని బరిలో ఉందని, తాము ప్రజల నమ్మకాన్ని నమ్ముకున్నామన్నారు. ప్రధాని మోదీ సభలతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పారు.

కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
తెలంగాణలో కాంగ్రెస్ ఆఫీస్ అడ్రస్ టీఆర్ఎస్
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి కొన్ని స్థానాల్లో గెలిపిస్తే ఫలితాలు రాగానే గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక్కడ కాంగ్రెస్ కు గాంధీభవన్ లేదని అది టీఆర్ఎస్ ఆఫీస్ కి ఎప్పుడో మారిపోయిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిణామాలతో ప్రజలు ఆ పార్టీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు.
కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ