SECOND PART OF PARLIAMENTS BUDGET SESSION TO BEGIN TODAY HERE IS DETAILS SK
Parliament: నేటి నుంచే పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. చర్చా? రచ్చా?
పార్లమెంటు భవనం
లోక్‌సభలో 36 శాతం మంది, రాజ్యసభలో 62 శాతం మంది సభ్యుల వయసు 60 ఏళ్లు దాటింది. వారి కోసం పార్లమెంట్లో రెండు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీలతో పాటు వారి కుటుంబ సభ్యులు అక్కడ టీకా తీసుకోవచ్చు.
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల మధ్య సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఒకే సారి కాకుండా.. వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఒక ప్రకటనలో వెల్లడించారు. అంటే ఈ సమావేశాలు నెల రోజుల పాటు జరగనున్నాయి.
పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమై.. ఫిబ్రవరి 13వరకు కొనసాగిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేళపెట్టారు. ఆ తర్వాత రాష్ట్రపతికి ధన్యవాదాల తీర్మానం, బడ్జెట్‌పై సాధారణ చర్చ నిర్వహించారు. బడ్జెట్‌తో పాటు కొత్త సాగు చట్టాలపైనా సభలో చర్చ జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేశాయి. తదుపరి సమావేశాలు మార్చి8కి వాయిదా పడ్డాయి.
తొలి విడతలో మొత్తం 49 గంటల 17 నిమిషాల పాటు చర్చ జరిగిందని లోక్‌సభ కార్యాలయం వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 16 గంటల 39 నిమిషాలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికే సరిపోయాయి. మరో 10 గంటల సమయం పాటు బడ్జెట్‌పై చర్చ జరిగింది. మొత్తం 117 మంది సభ్యులు బడ్జెట్ చర్చలో పాల్గొన్నారు.
ప్రస్తుతం తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశముంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో రైతుల ఆందోనలు 100 రోజులు పూర్తిచేసుకున్నాయి. ఈ సమావేశాల్లో మరోసారి వ్యవసాయ చట్టాలపై విపక్షాలు ఆందోళన చేసే అవకాశముంది.
మన దేశంలో రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ మార్చి 1 నుంచి ప్రారంభమయింది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీల వ్యాక్సిన్ తీసుకున్నారు. లోక్‌సభలో 36 శాతం మంది, రాజ్యసభలో 62 శాతం మంది సభ్యుల వయసు 60 ఏళ్లు దాటింది. వారి కోసం పార్లమెంట్లో రెండు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీలతో పాటు వారి కుటుంబ సభ్యులు అక్కడ టీకా తీసుకోవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.