SEC NIMMAGADDA WITHDRAW HIS PETITION IN AP HIGH COURT ON RATION DOOR DELIVERY NGS
Municipal elections: ఏపీ సర్కార్ పై పోరులో వెనక్కు తగ్గిన ఎస్ఈసీ?ఇంతకీ ఏమైంది?
ఎస్ఈసీ సంచలన నిర్ణయం
ఏపీలో ఎన్నికల రగడ మొదలైన తరువాత తొలి సారి ఎస్ఈసీ నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని.. తనంతట తానే వెనక్కు తీసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వంతో ఢీ అండే ఢీ అన్న ఆయన.. ఇలా తొలిసారి వెనక్కు తగ్గడం ఆసక్తికరంగా మారింది.
పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర సర్కార్ తో ఢీ అంటే ఢీ అన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పుడు రూటు మార్చారా? టీడీపీ నేతలు మాత్రం అవుననే అంటున్నారు. సోమవారం ఎస్ఈసీతో జరిగిన సమావేశంలోనే మీరు మారిపోయారు అంటూ ఎస్ఈసీకే చెప్పినట్టు సమాచారం. ఎస్ఈసీతో మీటింగ్ తరువాత మాట్లాడిన నేతలు అదే విషయం స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలప్పుడు అధికార పార్టీ అరాచకాలకు చెక్ చెపుతామన్న ఎస్ఈసీ తరువాత మారిపోయారని.. విపక్షాలు చేస్తున్న ఫిర్యాదులను అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా చేశారు. వారి విమర్శలు ఎలా ఉన్నా తనపని తాను చేసుకుపోతున్నారు ఎస్ఈసీ. విమర్శలను పట్టించుకోకుండా మున్సిపల్ ఎన్నికల్లో దూకుడుగా వెళ్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను కోర్టు ద్వారా సవాల్ చేసిన నిమ్మగడ్డ తొలిసారి వెనక్కు తగ్గారు.
ఏపీలో రేషన్ సరుకుల డెలివరీ వాహనాల రంగుమార్పు విషయంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వాహనాల రంగు మార్చాలన్న ఆదేశాలను ఆయన వెనక్కి తీసుకున్నారు. అయితే అంతకుముందు ఎస్ఈసీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో ఎస్ఈసీ తన ఆదేశాలు వెనక్కి తీసుకోవడంతో పిటిషన్ ను డిస్పోజ్ చేసింది కోర్టు. నిమ్మగడ్డ తన ఆదేశాలు వెనక్కి తీసుకోవడంతో, ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్ వాహనాలను తిప్పుకునే అవకాశం ప్రభుత్వానికి దొరికింది.
ఏపీలో స్ధానిక సంస్ధలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. వైసీపీ జెండా రంగులు, సీఎం జగన్ ఫొటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి లబ్ది చేకూరుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు . వాహనాలపై ఉన్న పార్టీ రంగులను మార్చాలని ఫిబ్రవరి 5న ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు.
ఎస్ఈసీ ఆదేశాలను ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటింటికీ రేషన్ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరింది. వాహనాల రంగులు మార్చాలంటే 3 నెలల సమయం పడుతుందని, భారీగా ఖర్చవుతుందని, ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని కోర్టుకి తెలిపింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పథకం ప్రారంభించామని.. దీన్ని అడ్డుకోకుండా ఎస్ఈసీని ఆదేశించాలని ప్రభుత్వం కోర్టుకి విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.
రేషన్ వాహనాలను రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదని తొలుత చెప్పిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తరఫు న్యాయవాదులు, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో పిటిషన్‌ను డిస్పోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఏపీలో స్ధానిక ఎన్నికల వేళ ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.