• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • SEC NIMMAGADDA RAMESH KUMAR KEY DECISION ON MUNICIPAL ELECTIONS NGS

Municipal Elections: ఎస్ఈసీ సంచలన నిర్ణయం.. వాళ్లకు మళ్లీ అవకాశం

Municipal Elections: ఎస్ఈసీ సంచలన నిర్ణయం.. వాళ్లకు మళ్లీ అవకాశం

ఎస్ఈసీ సంచలన నిర్ణయం

బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14 చోట్ల తిరిగి నామినేషన్ వేసేందుకు గడువు ఇచ్చారు.. అది కూడా కేవలం ఒక్క రోజు మాత్రమే

  • Share this:
    ఏపీలో మున్సిపల్ ఎలక్షన్ కాక రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ తీరుపై విమక్షలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎస్ఈసీకి ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆగినచోట నుంచే ఎన్నికలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా లాభం లేకపోవడంతో.. బలవంతపు ఏకగ్రీవాలపై ఫిర్యాదల వెల్లువెత్తాయి. వీటిన్నటిపైనా విచారణ చేసి సరైన నిర్ణయం తీసుకుంటాను అన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు.

    తిరుపతి కార్పొరేషన్‌‌తో పాటు పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు రాష్ట్ర నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి అవకాశం కల్పించారు. దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులకు రుజువులు ఉండడంతో..వాటన్నింటినీ పరిశీలించిన ఎన్నికల కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో 2, 8, 10, 21, 41, 45 వార్డులు, పుంగనూరులో 9, 14, 28 వార్డులు, కడప జిల్లా రాయచోటిలో 20, 31 వార్డులు, ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    అయితే మంగళవారం మధ్యాహ్నం వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు చేసి ఎస్‌ఈసీ అనుమతించిన వారికే నామినేషన్లకు అవకాశం కల్పించారు.

    అంతకుముందు అఖిలపక్ష నేతలతో మున్సిపల్ ఎన్నికలపై ఎస్‌ఈసీ చర్చించారు. వైఎస్సార్‌ సీపీ నుంచి అధికార ప్రతినిధి నారాయణమూర్తి, పద్మజారెడ్డి.. టీడీపీ నుంచి వర్ల రామయ్య, సీపీఐ నుంచి విల్సన్.. కాంగ్రెస్ నుంచి మస్తాన్‌వలి, సీపీఎం నుంచి వైవీ రావు హాజరయ్యారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిశీలిస్తామని, ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు పాటించాలని ఎస్‌ఈసీ కోరారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

    అయితే అఖిలపక్ష భేటీలో టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్‌ఈసీ బయటకు పంపేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో అడుగడుగునా ఎస్‌ఈసీ మాటలకు అడ్డుపడటంపై నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పలుమార్లు హెచ్చరించినా వర్ల రామయ్య పట్టించుకోలేకపోవడంతో ఆయనను సమావేశం నుంచి బయటకు పంపించినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చిన వర్ల రామయ్య.. గతంలో ఉన్నట్లు ఎస్‌ఈసీ లేరంటూ మండిపడ్డారు.

    అయితే వైసీపీ నేతలు మాత్రం వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించొద్దని ఎస్‌ఈసీకి సూచించినట్టు తెలుస్తోంది. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్‌ చేసుకోవద్దని సూచించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారని, పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్‌ చేసుకుంటామనే రీతిలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చెప్పారని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై టీడీపీ చేస్తోన్న దాడులను కంట్రోల్ చేయాలని ఎస్‌ఈసీని కోరామన్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో కోడ్ ఉల్లంఘించి ధర్నా చేస్తున్న చంద్రబాబుపై ఎస్‌ఈసీనే కేసు నమోదు చేయాలని కోరామన్నారు వైసీపీ నేతలు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు