Municipal Elections: చంద్రబాబు చిత్తూరు టూరుపై? ఎస్ఈసీ ఏమన్నారో తెలుసా?

తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు

చంద్రబాబు చిత్తూరు పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన్ను ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకోవడంతో గంటల తరబడి హైడ్రామా నెలకొంది. రాజకీయంగా సెగలు రేపిన ఈ ఘటనపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు.

 • Share this:
  ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజీ అయ్యారు. వరుస సమావేశాలు,  పర్యటనలతో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు సవ్యంగా సాగుతున్నాయి అన్నారు.

  తరువాత ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో విశాఖ కలెక్టరేట్లో రమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వర్చువల్ విధానంలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల రాజకీయ పార్టీల నేతలతో నిమ్మగడ్డ సమావేశం అయ్యారు. వారి అభ్యర్థనలను పూర్తిగా విన్నారు. విపక్షాలు చేసిన ఫిర్యాదులపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ క్షేత్ర స్థాయిలో చాలావరకు పరిస్థితులు పరిశీలించామని.. పంచాయితీ ఎన్నికల్లో 80శాతం దాటిన పోలింగ్ మున్సిపల్ ఎన్నికలకు ఊతం ఇచ్చాయని నిమ్మగడ్డ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి పోలింగ్ జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నారు. జనరల్ ఎన్నికల స్థాయిలో పోలింగ్ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ లిస్ట్ పంపిణీ చేయడం కొంత కష్టమైన వ్యవహారమే అయినా.. మార్చి 7వ తేదీ నాటికి పూర్తి చేయాలని, ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ప్రవర్తనా నియమావళి అమలు చేస్తామన్నారు.

  అలాగే ప్రచారాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఒక్కో ఇంటికి ఐదుగురు మించి ప్రచారాలకు వెళ్ల కూడదనే నిబంధన అన్ని పార్టీలకు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రోడ్ షోల విషయంలో బాధ్యత పోలీసులదేనని అన్నారు. ఆరోగ్య, భద్రత పరమైన అంశాలపై గతంలోనే ఉన్న నిబంధనలు అమల్లో ఉంటాయని మొబైల్ టీమ్స్ మరింత క్రియాశీలకంగా పని చేయాలని అధికారులకు సూచించారు. మద్యం, డబ్బు పంపిణీలపై నిఘా ఉందన్నారు. ప్రలోభాలకు అవకాశం ఉన్న చోట్ల రాత్రి పూట కూడా యాక్టివ్ గా పని చేయాలని పోలీసులను, ఎన్నికల అధికారులను కోరారు. విశాఖలో బార్ల యజమానులు వేధింపులపై ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. అలాంటి వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఒక్క ఫిర్యాదు అయినా రుజువు చేస్తే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీ వీసీ కుల సంఘం సమావేశానికి హాజరవ్వడం తీవ్రమైన అంశంగా పరిగణించామని.. దీనిపై విచారణ కోసం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశామని, ప్రాథమికంగా కొన్ని ఆధారాలు లభించాయని అన్నారు. ఒత్తిడికి లోనై కొన్ని చోట్ల నామపత్రాలు వేయడానికి అవకాశం లేదనే అంశం మా దృష్టికి వచ్చిందని సాక్ష్యాధారాలు ఉన్న ప్రతీ చోట చర్యలు తీసుకుంటుంన్నామని అన్నారు. ఇందు కోసం విశేష అధికారాలను ఉపయోగిస్తున్నామని అన్నారు.

  మరోవైపు రోజంతా టెన్షన్ క్రియేట్ చేసిన చంద్రబాబు పర్యటనపైనా స్పందించారు. ఆయన  పర్యటనకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టులోనే చంద్రబాబును అడ్డుకున్నారు. దీనిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా తిరుపతి వెళ్లే హక్కు కూడా తనకు లేదా అంటూ అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే చిత్తూరు పర్యటన కోసం చంద్రబాబు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి కోరలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు.
  Published by:Nagesh Paina
  First published: