SEC NIMMAGADDA RAMESH KUMAR ISSUES SENSATIONAL ORDERS ON ANDHRA PRADESH LOCAL BODY ELECTIONS GIVE CHANCE TO CANDIDATES WHO DIDNT FILED NOMINATIONS BY FACING THREATENS FROM OPPOSITIONS HERE ARE THE DET
AP Local Body Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై (AP Local Body Elections) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh kumar) సంచలన ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఓ వైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మరో వైపు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇదే ఊపులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా జారీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది జరిగిన నామినేషన్ల సందర్భంగా ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశమిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఆధారాలతో వస్తే...
బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారు ఎవరైనా ఉంటే ఈనెల 20లోపు నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో పేర్కొంది. ఏదైనా కారణాల వల్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోతే మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానైనా కలెక్టర్లకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ ఆదేశాలిచ్చినట్లు నిమ్మగడ్డ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ప్రకటన
అప్పుడే ప్రకటన..?
పంచాయతీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ ఎన్నికలను కూడా గతంలో నిలిపేసిన దశ నుంచి కొనసాగించాలా లేక కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలా అనే అంశంపై ఎస్ఈసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయనిపుణులతో కూడా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా.. చాలా మండలాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదింరిచి ఏకగ్రీవాలు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ తు ఫిర్యాదులు కూడా అందాయి. అప్పట్లో ఎన్నికలు వాయిదా పడటంతో ఏకగ్రీవాలు, ఫిర్యాదుల అంశానికి బ్రేక్ పడింది.
ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉండటంతో ఏకగ్రీవాలు, ప్రతిపక్షాల ఫిర్యాదులపై మధ్యేమార్గంగా ముందుకెళ్లాలని ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలని భావించే తాజా ఆదేశాలిచ్చారు. దీన్ని బట్టి చూస్తే మార్చి 15న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది . మరి ఎస్ఈసీ ఇచ్చిన గడువులోగా నామినేషన్ల విత్ డ్రాకు సంబంధించిన ఫిర్యాదుల వివరాలు వస్తారాయా..? వస్తే వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇదే అమలైతే అధికార వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.