Save Nallamala: నల్లమల ఉద్యమంపై స్పందించిన కేటీఆర్

యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: September 13, 2019, 9:43 PM IST
Save Nallamala: నల్లమల ఉద్యమంపై స్పందించిన కేటీఆర్
కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
Save Nallamala: నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. యురేనియంతో తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులాంటి నల్లమల అడవులు సర్వనాశనమవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అడవి తల్లినే నమ్ముకున్నామని, తమ జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని గిరి పుత్రులు కంటతడి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలతో పాటు గిరిజన సంఘాలు, మేధావులు రంగంలోకి దిగారు. సేవ్ నల్లమల పేరుతో ఉద్యమాన్ని నడుపుతున్నారు. వీరికి సినీ ప్రముఖులు సైతం బాసటగా నిలుస్తున్నారు. యురేనియంతో పచ్చటి అడవులను నాశనం చేయొద్దని గళం విప్పుతున్నారు.

ఇలా అన్ని వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల వ్యవహారంలో అందరి ఆవేదనను తాను చూస్తున్నానని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి వ్యక్తిగతంగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కేటీఆర్. యురేనియం తవ్వకాలపై టాలీవుడ్‌లోనూ తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ సపోర్ట్ తెలియజేసారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్, విజయ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, అనసూయ, సమంత, రామ్ సైతం సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు. యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, నల్లమల అడవుల్లో యురేనియం ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు సర్వేకు అనుమతి ఇచ్చింది. నల్లమల అడవిలోని కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్​లో 38 చదరపు కిలో మీటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అనుమతులు రావడంతో అచ్చంపేట, అమ్రాబాద్​ అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. యురేనియం సర్వే గురించి తెలియగానే రంగంలోకి దిగిన మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు.. యువజన, కుల సంఘాల నాయకులతో కలిసి సేవ్ నల్లమల ఉద్యమాన్ని చేపట్టారు.
First published: September 13, 2019, 9:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading