రాబోయే రోజుల్లో సీఎం పీఠం మనదే...శివసేన నేత సంచలన వ్యాఖ్యలు

Maharashtra Assembly Election 2019 | వచ్చే దసరా ర్యాలీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శివసేన అధినేత ఉద్దవ్ థాకరే పక్కన కూర్చోవాల్సి వస్తుందంటూ ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 9, 2019, 11:22 AM IST
రాబోయే రోజుల్లో సీఎం పీఠం మనదే...శివసేన నేత సంచలన వ్యాఖ్యలు
సంజయ్ రౌత్(Photo:ANI)
news18-telugu
Updated: October 9, 2019, 11:22 AM IST
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 15 పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తున్నా ప్రధాన పోటీ మాత్రం రెండు కూటముల మధ్యే నెలకొంటోంది. అధికార బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ రెండు కూటములుగా ఏర్పడి తలపడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో శివసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో మహారాష్ట్రల్లో శివసేనదే సీఎం పీఠమంటూ ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై శివాజీ పార్క్‌ వద్ద మంగళవారం రాత్రి జరిగిన దసరా ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఆయన..ప్రస్తుతం శివసేన కాస్త వెనక్కితగ్గి ఉంటోందని, ముందు ముందు ఇలాగే కొనసాగబోమని వ్యాఖ్యానించారు.

కూటమిలో భాగస్వామ్యమైనందున కొన్ని కీలక అంశాల్లో ఆచితూచి మాట్లాడాల్సి వస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. వచ్చే దసరా ర్యాలీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే‌కి పక్కన కూర్చోవాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు మంత్రివర్గంలోనూ శివసేన సింహభాగాన్ని సొంతం చేసుకోవాల్సి ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో...నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగిందని ఉద్దవ్ థాకరే అందరికంటే ముందు గళం విప్పారని గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్నది పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే కలగా గుర్తుచేశారు. ఆ కలను నెరవేర్చినందుకే బీజేపీతో ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంలో వాడే తొలి ఇటుకపై శివసేన పార్టీ పేరు రాయాల్సి ఉంటుందని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

First published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...