news18-telugu
Updated: September 19, 2019, 5:00 PM IST
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ తారా స్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. హుజూర్నగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పేరును ఉత్తమ్ ప్రకటించడం, పవన్ కల్యాణ్ మీటింగ్‌కు పార్టీ పెద్దలు వెళ్లడాన్ని కొందరు నేతలు తప్పుబట్టుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో కుమ్ములాటపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఉత్తమ్‌ని తప్పుబట్టడం సరికాదని.. అభ్యర్థి ఎంపికలో ఉత్తమ్‌కు స్వేచ్ఛ ఉంటుందని వెనకేసుకొచ్చారు. కానీ తుది నిర్ణయం మాత్రమే అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు సహజం. పార్టీలో సీనియర్స్ మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలే దీనికి కారణం. అన్ని పార్టీలోనూ ఇలాంటివి ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో బయటపడవు. జాతీయ పార్టీలోనే బయటకొస్తాయి. పార్టీ ముఖ్యనేతలు ఇలాంటి విషయాల్లో సంయమనం పాటించాలి. కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీయే నాయకుడు. హుజూర్ నగర్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికలో ఉత్తమ్ కుమార్‌కు స్వేచ్ఛ ఉంటుంది. అభ్యర్థిపై తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దే.
— జగ్గారెడ్డి
వి.హనుమంతరావుపై పార్టీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు జగ్గారెడ్డి. ఎవరు పీసీసీ అధ్యక్షుడైనా అందరూ సహకరించాలని స్పష్టంచేశారు.
కాగా, యురేనియం అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ వెళ్లి జనసేన ఫ్లాగ్ కింద కూర్చోవడం ఏంటని సంపత్ సహా పలువురు నేతలు తప్పుబట్టారు. ఇదే కాదు హుజూర్నగర్ ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో పీసీసీ చీఫ్‌తో ఎంపీ రేవంత్ రెడ్డి విభేదించారు. ఉత్తమ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కుంతియాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా నేతల మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరడం పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది.
Published by:
Shiva Kumar Addula
First published:
September 19, 2019, 5:00 PM IST