ఇసుకపై చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం.. నిస్సహాయ స్థితిలో సీఎం జగన్

ప్రతీకాత్మక చిత్రం

కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పేర్నినాని చేసిన ప్రకటన ఇప్పుడు వారిలో కలవరం రేపుతోంది. రాష్ట్రంలో ఇసుక సరఫరా సాధారణ స్ధితికి రావాలంటే మరో రెండు నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 • Share this:
  ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదునెలలు కావస్తున్నా ఇసుక మాత్రం సామాన్యుడికి అందని ద్రాక్షే అవుతోంది. కొత్త పాలసీ పేరుతో నాలుగు నెలలు చోద్యం చూసిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు వరదల కారణంగా ఇసుక ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. సిమెంట్ కంపెనీల నుంచి మామూళ్ల కోసం ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే ఇసుక పంపిణీని ఆపేశారని విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ఇన్నాళ్లు వాటిని తేలిగ్గా తీసున్నారు జగన్. ఇప్పుడు వరదల పేరుతో ఇసుకపై నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది ఏపీ ప్రభుత్వం.

  ఏపీలో ఆరునెలలుగా ఇసుక పంపిణీ నిలిచిపోవడంతో నిర్మాణం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. దినసరి కూలీలకు రోజు గడవడమే కష్టంగా మారిపోయింది. అయినా తొలి నాలుగు నెలలు మొండిపట్టుదల వీడని ప్రభుత్వం... ఇప్పుడు వరద పేరుతో చేతులెత్తేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ జనం కష్టాలు చూస్తున్నా, నిస్సహాయత వ్యక్తం చేయడం మినహా చేయగలిగిందేమీ లేదన్నట్లు మంత్రి పేర్నినాని చేసిన ప్రకటన ఇప్పుడు నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికుల్లో గుబులు రేపుతోంది. నెలరోజులుగా ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో నదులన్నీ వరదతో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇసుక వెలికి తీయడం సాధ్యం కావడం లేదని మైనింగ్ అధికారులు చెబుతున్నారు.

  అయితే వరదల నేపథ్యంలో నదుల నుంచి ఇసుక వెలికితీత సాధ్యం కాకపోవడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా, అంతకు ముందే ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి ఇసుక స్టాక్ పెట్టుకుని ఉంటే ఇలాంటి దారుణమైన పరిస్ధితి దాపురించేది కాదని సాధారణ జనం సైతం చెబుతున్నారు. కానీ ప్రభుత్వం గత టీడీపీ సర్కారు అక్రమాలకు పాల్పడిందన్న సాకుతో ఇసుక విధానాన్ని మొత్తంగా రద్దు చేయడంతో పాటు సరఫరా పునరుద్దరణకు నాలుగు నెలలకు పైగా సమయం తీసుకుంది. ఈ సమయంలో ఇసుకను సేకరించి స్టాక్ పాయింట‌్లలో నిల్వచేసి ఉంటే ఇప్పుడు పరిస్ధితి మరోలా ఉండేది. కానీ అధికారులకు ఈ విషయంలో ముందు చూపు లేకుండా పోయింది. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా కనీసం రెండు నెలల పాటు ఇసుక దొరికే పరిస్ధితి లేదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.

  రాష్ట్రంలో ఇసుక కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం జగన్‌కు పూర్తి అవగాహన ఉంది. జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వరదలతో ఇసుక లభ్యం కాకపోవడంపై జగన్ సైతం నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. నదుల్లో ఓసారి వరద తగ్గితే ఇసుక సరఫరా పునరుద్ధరిస్తాం
  పేర్నినాని, సమాచార మంత్రి


  కోస్తా జిల్లాల్లో ఓవైపు నదుల ప్రవాహంతో ఇసుక వెలికితీత సాధ్యం కాదని చెబుతున్న గనుల శాఖ అధికారులు... మరోవైపు హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలకు ఇసుక అక్రమ రవాణాపై మాత్రం నోరు మెదపడం లేదు. ఇసుక కొరత నేపథ్యంలో ఉన్న అరకొర ఇసుకను ప్రజలకు అందించాల్సింది పోయి రాష్ట్రం దాటి పోతున్నా కనీస చర్యలకు ముందుకు రావడం లేదు. నామమాత్రపు కేసులతో, మామూళ్లతో కాలం గడిపేస్తున్నారు. దీంతో జనం కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పేర్నినాని చేసిన ప్రకటన ఇప్పుడు వారిలో కలవరం రేపుతోంది. ఏదేమైనా రాష్ట్రంలో ఇసుక సరఫరా సాధారణ స్ధితికి రావాలంటే మరో రెండు నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: