ఆంధ్రప్రదేశ్ విజయనగరం సంస్థానంలో మరోసారి మాటల తూటాలు పేలాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు, మాన్సస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు మధ్య ట్విట్టర్ వేదికగా వార్ జరిగింది. ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తూ అశోక్ గజపతి రాజు చేసిన ట్వీట్ కు సంచయిత కౌంటర్ ఇచ్చారు. మాన్సస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత పేరు తెరమీదకు వచ్చినప్పటి నుంచి బాబాయి-కూతుళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ విషయంలో అశోక్ పై సంచయిత ఒంటికాలిపై లేస్తున్నారు. మాన్సస్ ట్రస్టులో అక్రమాలు జరుగుతున్నాయని.., అరికట్టడానికే తాను వచ్చాని గతంలో సంచయిత తెలిపారు. అంతేకాదు ట్రస్ట్ రెవెన్యూ కార్యాలయాన్ని విజయనగరం కోట నుంచి విశాఖపట్నం తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అశోక్ గజపతి రాజును టార్గెట్ చేశారు సంచయిత. ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తూ “తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25 వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని మరియు మన పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను” అంటూ అశోక్ గజపతి రాజు ట్వీట్ చేశారు.
అశోక్ గజపతిరాజు ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన సంచయిత “పార్టీపెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు అశోక్ గజపతిరాజు గారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది. ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతి రాజు గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతిరోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది” అంటూ కౌంటర్ ఇచ్చారు. ట్వీట్ తో అప్పట్లో ఎన్టీఆర్ రాసిన లేఖను కూడా పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా ద్వారా అశోక్ కు నేరుగానే సంచయిత కౌంటర్ ఇవ్వడంతో మరోసారి విజయనగర సంస్థాన రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ మద్దతుతోనే సంచయిత ఇలా రెచ్చిపోతున్నారని అశోక్ వర్గం మండిపడుతుండగా.., వాస్తవాన్ని సూటిగా చెప్పడంలో తప్పేముందని వైసీపీ నేతలంటున్నారు.