ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు ఇది ఒక పెద్ద అలర్ట్. రాష్ట్రంలో విద్యుత్ కోతల (Power Cuts) ముప్పు పొంచి ఉంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత (Coal Crisis) ఏర్పడటంతో ఆ ప్రభావం ఏపీపైనా పడనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు విద్యుత్ వినియోగాన్నితగ్గించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కరెంట్ కోతలు ఎక్కువగా ఉంటాయని.. అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతం శీతాకాలంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తే... ఆ నిల్వలు వేసవికాలంలో పనికొస్తాయని సజ్జల అభిప్రాయపడ్డారు. వచ్చే ఐధారు నెలల్లో ప్రజలంతా పరిమిత స్థాయిలో వినియోగించాలన్నారు. లేకుంటే పరిస్థితి చేయిదాటే ప్రమాదముందని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
రానున్న రోజుల్లో విద్యుత్ కొనుగోలు కూడా భారమయ్యే అవకాశముందని సజ్జల అన్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధర కూడా పెరిగిందన్నారు. యూనిట్ ధర రూ.20 నుంచి రూ.25 వరకు పెరిగే అవకాశముందన్నారు. కొవిడ్ టైమ్ లో ఆక్సిజన్ కొరత ఎలా ఉందో విద్యుత్ కొరత కూడా అలాగే ఉండొచ్చని హెచ్చరించారాయన. ప్రజలంతా బాధ్యతాయుతంగా ఆలోచించి విద్యుత్ ఆదా చేయాలని సజ్జల సూచించారు.
బొగ్గు కొరత
ఏపీలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద ఒకటి రెండు రోజులకు సరిపడా నిల్వలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరాల మధ్య అంతరం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడు రోజులుగా రద్దీ సమయాల్లో…కొన్ని ప్రాంతాల్లో కోతలు అమలువుతున్నాయని (Power cut), సాయత్రం 06 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు బంద్ (Switch of acs) చేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు. గతేడాదితో పోలిస్తే... రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20 శాతం పెరిగిందని, కోవిడ్ కు ముందు అక్టోబర్ రోజుకు 160 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే.. ఇప్పుడు 195 మిలియన్ యూనిట్లు అవసరం అవుతోందన్నారు.
దేశంలో 135 థర్మల్ ప్లాంట్లు ఉండగా దాదాపు అన్ని చోట్ల బొగ్గు కొరత ఉంది. ప్రస్తుతం దేశంలో నుంచే 70శాతం విద్యుత్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. బొగ్గు కొరత ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడటంతో డిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ, ఏపీ, తమిళనాడుకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పంజాబ్ లో రోజుకు మూడు గంటలపాటు కరెంట్ కోతలున్నాయి. కేరళలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోనూ విద్యుత్ కోతలు తప్పవని ప్రభుత్వం సంకేతాలిచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Power problems, Sajjala ramakrishna reddy