Sagar by poll election: సమయం లేదు మిత్రమా.. ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు.. బలాలు, బలహీనతలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

Sagar by election: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సామాజిక వర్గ బలాలతో టికెట్లు కేటాయించిన ప్రధాన పార్టీలు, గెలుపు కోసం ఆయా పార్టీలు బలబలాలను కూడా అంచనా వేసుకుంటునే ప్రచారంలో దూకుడు పెంచాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంపైనే ఫోకస్ పెట్టాయి.

 • Share this:
  నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కుల సమీకరణల ఆధారంగా టికెట్లు కేటాయించిన ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీ ప్రచారాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా, మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారాన్ని ప్రధాన పార్టీలు ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల బలాలు, బలహీనతలు చూస్తే అధికార టీఆర్ఎస్ యాదవ సామాజికవర్గ ఓట్లతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పథకాలు పొందిన లబ్ధిదారులు, అత్యధికంగా నియోజకవర్గంలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో ఉన్న పార్టీ సభ్యులు, సానుభూతిపరులు బలం కాగా, అభ్యర్థి స్థానికుడు కాకపోవడం, నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉండడం, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం టీఆర్ఎస్ కు బలహీనతలుగా మారాయి.

  ఈ నెల 14 న సీఎం పర్యటన
  తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 14న హాలియా పట్టణ శివారులో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 14న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. సభ నిర్వహణకు సంబంధించి హాలియా శివారులోని పెద్దవూర మార్గంలో 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించి పార్టీ నేతలు అనుమతులు కూడా పొందారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నలుమూలల నుంచి జనసమీకరణ చేస్తున్న నేపథ్యంలో 30 ఎకరాలను పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించారు.

  ఇక కాంగ్రెస్ ప్రధాన బలం సీనియర్ నాయకుడు జానారెడ్డి బరిలో ఉండడతోపాటు, సాంప్రదాయ ఓటు బ్యాంకు, ఏడు సార్లు ఎమ్మెల్యేగా జానారెడ్డి గెలిచిన సమయంలో నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి, గత ఎన్నికల్లో ఓడిపోవడంతో సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక కాంగ్రెస్ బలం. కాగా స్థానిక ప్రజాప్రతినిధులు తక్కువగా ఉండడం, ప్రచారంలో కొంత వెనకబడటం, కొత్తతరం ఓటర్లను ఆకర్షించలేకపోవడం కాంగ్రెస్ బలహీనతలు.

  ఇక బీజేపీ ఎస్టీ ఓట్లతోపాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, పార్టీ ఓట్లతో, జనరల్ సీట్లో ఎస్టీ కిచ్చామని ప్రచారం, ముఖ్య నేతల ప్రచారాలు బలం కాగా, ఇటీవల పార్టీ వీడుతున్న వారిని నివారించలేకపోవడం, సంస్థాగతంగా పార్టీ బలంగా లేకపోవడం బీజేపీ బలహీనతలుగా చెప్పవచ్చు. బీజేపీ పార్టీ చీఫ్ బండి సంజయ్ ఈ నెల 11న రాత్రి నల్గొండ చేరుకుని బస చేస్తారు. మరుసటి రోజు 12న నల్గొండ నుంచి బయల్దేరి గుర్రంపోడు మండలం నుంచి రోడ్ షో ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తిరిగి పెద్దవూర మండలంలో రోడ్ షో మొదలవుతుంది. రాత్రివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి నల్గొండకు బయల్దేరి వెళతారు. అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు 13న ఉదయం నల్గొండ నుంచి బయల్దేరి హాలియా చేరుకొని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సభలో పాల్గొననున్నారు.

  రేపు కిషన్ రెడ్డి రోడ్ షో
  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో రోడ్ షోలో పాల్గనున్నారు. 11న ఉదయం నల్గొండ నుంచి బయల్దేరి అనుమల మండలం పులిమామిడి గ్రామంలో రోడ్ షో ప్రారంభిస్తారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ నేటి నుంచి నాలుగు రోజులపాటు అనుమల మండలంలో ప్రచారంలో పాల్గొంటారు.

  ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే..
  దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీతో తలపడిన టీఆర్‌ఎస్‌ సాగర్‌ ఉప ఎన్ని కలో కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ విధానాలు, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి పనితీరే లక్ష్యంగా ప్రచారం సాగిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పనితీరు, ధరల పెరుగుదల, రాష్ట్రానికి నిధులు, పథకాల అమల్లో వివక్ష తదితరాలపై విమర్శలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ బలంపైనే దృష్టి కేంద్రీకరించింది.
  Published by:Veera Babu
  First published: